సిరుల వరి విత్తనం
నెల్లూరు(పొగతోట): నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు నూతన సన్నరకం వరి వంగడం ఎన్‌ఎల్‌ఆర్–3648ను సృష్టించారు. దీన్ని అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను ఇచ్చే ఈ రకం 130 నుంచి 135 రోజుల్లో కోతకు వస్తుంది. అగ్గి, దోమపోటు వంటి తెగుళ్లతో పాటు అధిక వర్షాలకు సైతం తట్టుకుని నేలవాలకుండా ఉండడం దీని ప్రత్యేకత.
గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా సాగు
జిల్లాలోని రైతులతో గత ఖరీఫ్ సీజన్‌లో ఎన్‌ఎల్‌ఆర్–2648 రకాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. సుమారు 200 మంది నూతన వంగడాన్ని సాగు చేశారు. ఎకరాకు మూడున్నర నుంచి నాలుగు పుట్ల వరకు ధాన్యం దిగుబడి వచ్చింది. మొక్క 85 నుంచి 90 సెంటి మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. ఒక్కో దుబ్బులో 20 నుంచి 25 వెన్నులు వస్తాయి. వెన్నులో 250 నుంచి 300 వరకు గింజలు ఉండడంతో అధిక దిగుబడులు వస్తున్నాయి.
నెల్లూరు రైస్ ప్రత్యేకం
రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ నెల్లూరు రైస్‌కు అత్యంత డిమాండ్ ఉంది. నెల్లూరు సన్న బియ్యాన్ని అధిక శాతం మంది ఇష్టపడుతారు. నెల్లూరు ధాన్యం సన్నగా ఉండి వండిన తరువాత అన్నం తినడానికి రుచికరంగా ఉంటుంది. జిల్లాలోని రైతులు వరి వంగడాలు అందుబాటులో లేక తెలంగాణకు సంబంధించిన కేఎన్‌ఎం వరి రకాలపై ఆధారపడుతున్నారు. కేఎన్‌ఎం స్థానంలో ఎన్‌ఎల్‌ఆర్–3648 రకం నూతన వంగడాన్ని శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఖరీఫ్ సీజన్‌లో విడవలూరుకు చెందిన రైతు శ్రీనివాసులరెడ్డి కొత్త రకాన్ని సాగు చేశారు. ఈ రకం గింజ నాణ్యంగా ఉండి బీపీటీల కన్నా బాగుందని, వెన్ను దశలో అధిక వర్షాలు కురిస్తే పంట పడిపోకుండా నిలబడుతుందని ఆయన చెబుతున్నారు. కేఎన్‌ఎం, ఇతర వరి రకాలను సకాలంలో సాగు చేయాలి. సకాలంలో నాట్లు వేయకపోతే పంట దెబ్బతింటుంది. అయితే ఎన్‌ఎల్‌ఆర్ 3648 రకాన్ని ఏ కాలంలో అయినా సాగు చేయొచ్చు. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన రంగయ్య రెండెకరాల్లో సాగు చేయగా 8 పుట్లకుపైగా దిగుబడి రావడంతో శాస్త్రవేత్తలు నూతన వంగడం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రబీ సీజన్‌లో అధికంగా సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అందుకనుగుణంగా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తుపాన్లు.. తెగుళ్లను తట్టుకునేలా..
నూతన వరి వంగడం ఎన్‌ఎల్‌ఆర్–3648 సృష్టి
నెల్లూరు శాస్త్రవేత్తల ఘనత
అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలం
130 నుంచి 135 రోజుల్లో చేతికి పంట
ఎకరాకు నాలుగు పుట్ల వరకు దిగుబడులు
ప్రతికూల వాతావరణంలోనూ సాగు చేయొచ్చు
నూతనంగా రూపొందించిన ఎన్‌ఎల్‌ఆర్–3648 రకాన్ని అన్ని సీజన్లలో సాగు చేయొచ్చు. ఈ రకం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుంది. గత ఖరీఫ్ సీజన్‌లో ప్రయోగాత్మకంగా కొందరి రైతులతో సాగు చేయించగా మంచి దిగుబడులు వచ్చాయి. రబీసీజన్‌లో సాగుచేసేందుకు ఎవరైనా రైతులు ముందుకొస్తే విత్తనాలు అందజేస్తాం.
– శ్రీలక్ష్మి, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రం అధికారిణి


