
లక్ష్మీనగర్‌లో చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి వెండి వస్తువులు, టీవీని గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బాలాజీ నగర్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో రవీంద్రశర్మ, వసంతలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. కుమారుడు, బంధువులు హైదరాబాద్‌లో ఉన్నారు. వారిని కలిసేందుకు ఈనెల మూడో తేదీన దంపతులు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈక్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. అర కేజీ వెండి వస్తువులు, ఒక టీవీని చోరీ చేశారు. శుక్రవారం ఇంటికొచ్చిన బాధితులు బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిపై హత్యాయత్నం
నెల్లూరు(క్రైమ్): ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ మద్యం బాటిళ్లతో ఓ వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన నెల్లూరు త్యాగరాజనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. త్యాగరాజనగర్ మూడో వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వి.కిశోర్‌కుమార్, అరుణ దంపతులు నివాసముంటున్నారు. వారికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు, ఏడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. కిశోర్ జేసీబీ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దండుగులు అతని ఇంటికెళ్లారు. కిశోర్ తలుపు తీశారు. ముగ్గురూ లోనికెళ్లి చంపండిరా అంటూ తమ చేతిలో ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లతో కిశోర్‌పై దాడిచేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. భార్య అనూష పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. ఆమె స్థానికుల సహకారంతో భర్తను 108 అంబులెన్స్‌లో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిశోర్ ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కోలుకుంటే దాడికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వర్షం..
అన్నదాతలకు నష్టం
సోమశిల: అనంతసాగరం మండలంలో కురిసిన వర్షాలతో వందల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. పాతదేవరాయపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగి నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు.
కండలేరులో
59.990 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 59.990 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,790 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,950, పిన్నేరు కాలువకు 500, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
పాముకాటుకు వ్యక్తి మృతి
కలువాయి(సైదాపురం): పాముకాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కలువాయి మండలం మాదన్నగారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండు పెంచలయ్య (48) కూలీ పనులు చే సుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ముగ్గు రు పిల్లలున్నారు. అతను గురువారం రాత్రి బహిర్భూమికెళ్లి తిరిగి ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నోటినుంచి నురగ రావడంతో కు టుంబ సభ్యులు గమనించి కలువాయిలోని ప్రైవే ట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.
20న కోనలో
దీపావళి వేడుకలు
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో 20వ తేదీ దీపావళి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు శుక్రవారం తెలిపారు. కోన పురవీధుల్లో రథోత్సవం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నరకాసుర వధ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. ఉదయం 9 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను రథంపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.