
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,521 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని, ముందుగా వెళ్తే అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.
బీఎస్‌ఎన్‌ఎల్
దీపావళి ఆఫర్లు
నెల్లూరురూరల్: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త వినియోగదారులకు దీపావళి పండగ సందర్భంగా కానుక ప్రకటించిందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జేబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్, రిటైలర్ వద్దకు గాని లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశం నవంబరు 15 వరకు కొనసాగుతుందన్నారు.
రెవెన్యూ జోన్–3 క్రీడలు వాయిదా
నెల్లూరు (అర్బన్): ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఒంగోలులో జరగాల్సిన జోన్–3 (నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు) క్రీడలను వర్షాల నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీలకు వాయిదా వేశామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అమరావతి జేఏసీ చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి శుక్రవారం నెల్లూరులో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడేళ్లకు ఒక దఫా రెవెన్యూ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నామన్నారు. జోన్ల స్థాయిలో పోటీలు పూర్తి చేసుకుని వచ్చే నెల 7 నుంచి 3 రోజులపాటు అనంతపురంలో రాష్ట్ర స్థాయి పోటీలను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
సంగం తహసీల్దార్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి
సంగం: రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితాలో ఉన్న సంగం తహసీల్దార్ సోమ్లానాయక్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. దీంతో శుక్రవారం కార్యాలయంలో సిబ్బంది పూలమాలలు, శాలువాలతో సోమ్లానాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, ఆర్‌ఐ సల్మా, వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు.
సమష్టి కృషితో వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన
● జేసీ ఎం. వెంకటేశ్వర్లు
నెల్లూరురూరల్: సమష్టి కృషితోనే వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన సాధ్యమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ స మావేశం జరిగింది. ఇప్పటి వరకు వెట్టిచాకిరీ నిర్మూలన, ప్రయత్నాయ ఉపాధి, పునరావాస కల్పనకు తీసుకున్న చర్యలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సీహెచ్ విజయ్‌కుమారరెడ్డి కమిటీ సభ్యులకు వివరించారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఇటుక బట్టీలు, పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, రొయ్యలు, చేపల గుంతలు, రైసు మిల్లులు, హోటళ్ల మొదలైన ప్రదేశాల్లో కమిటీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేసి వెట్టిచాకిరి బాధితులను గుర్తించాలన్నారు. విముక్తి పొందిన బాలురకు ఒక సర్టిఫికెట్ అందించి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో తోడ్పాటు అందిస్తున్నాయని వివరించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, డీఎంహెచ్‌ఓ సుజాత, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, ఏఎస్‌ఐ వై శ్రీహరి, సభ్యులు బషీర్, సుదర్శన్, దాసరి పోలయ్య, సత్యవతమ్మ, పాపయ్య పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు