
జర్నలిస్టుల హక్కులను హరించడమే
ఆత్మకూరు: ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికారంగం ఓ స్తంభం. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ ప్రభుత్వం ఎడిటర్లు, బ్యూరోలు, విలేకర్లపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని విలేకరులు ఎలుగెత్తి చాటారు. ‘సాక్షి’ మీడియాపై ప్రభుత్వం కేసులు బనాయించడం, పోలీసులతో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తుండడాన్ని నిరసిస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, విలేకర్లపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దారు సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరుతో పాటు రూరల్, ఏఎస్‌పేట, చేజర్ల, సంగం, అనంతసాగరం, మర్రిపాడు మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల పాల్గొన్నారు.