
నకిలీ మద్యంపై పోరాటమే
● ప్రభుత్వ పెద్దల భరోసాతో టీడీపీ నేతలు ఈ స్థాయిలో మద్యం తయారీ చేశారు
● 16 నెలలుగా నకిలీ మద్యం తయారవుతుంటే.. గుర్తించలేని గుడ్డి ప్రభుత్వం
● ఈ కేసును నీరుగార్చేందుకే సిట్ పేరుతో విచారణ
● సీబీఐ విచారణ జరిగితే నకిలీ మద్యం వెనుక ఎవరున్నారనేది నిగ్గుతేలుతుంది
● రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్
ప్రెసిడెంట్ కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా కూటమి ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులంతా ప్రభుత్వ పెద్దల వాటాదారులు కావడంతో మొక్కుబడిగా కేసులు నమోదు చేసి, టీడీపీ నేతలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారులను రక్షించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కుంభకోణాన్ని వైఎస్సార్‌సీపీకి ఆపాదించడం హాస్యాస్పదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ కోరకుండా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ అధికారులతో విచారణకు ఆదేశించి పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు.
ప్రభుత్వ పెద్దల పాత్రే కీలకం
ఈ నకిలీ మద్యం తయారీలో ప్రభుత్వ పెద్దల పాత్ర కీలకంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీరి అనుమతి లేకుండానే ఈ స్థాయిలో మద్యం తయారు చేయడం అంటే సాధ్యం కాదన్నారు. 16 నెలలుగా నకిలీ మద్యం తయారు అవుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందని నిలదీశారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు, ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖలు ఏమీ చేస్తున్నాయని నిలదీశారు. దీన్ని బట్టి అసమర్థ ప్రభుత్వమా?. గుడ్డి ప్రభుత్వమా? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో అసలు జరగని మద్యం స్కామ్‌పై సిట్ విచారణ జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతుందన్నారు.
డైవర్షన్ రాజకీయాలు
సిట్ విచారణ పేరుతో కేసులో సంబంధం లేని జోగి రమేష్‌పై కేసును ఆపాదించడం సరికాదని, కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాసే మీడియాపై కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ‘సాక్షి’ మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ, నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తుంటే, కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని కేసులు పెట్టి, విచారణ పేరుతో నానా యాగి చేస్తున్నారు. రాజ్యాంగంలోని ప్రధాన పాత్ర పోషించే మీడియాపై కూటమి ప్రభుత్వ చర్యలను వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఖండిస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో గ్రామాల్లో నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమగా తయారైందన్నారు. నకిలీ మద్యం మన రాష్ట్రంలో తయారయ్యి పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తుంటే, ప్రభుత్వం ఎందుకు నిరోధించడానికి చర్యలు తీసుకోవడం లేదని, ప్రతి మద్యం షాపులో నాలుగు బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్ అమ్ముతుంటే, అధికారులు ఎందుకు గుర్తించి, ప్రజల ప్రాణాలను కాపాడలేకున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనంతా, కక్ష సాధింపు చర్యలు, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, దాడులు చేయించడంతో సరిపోయిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జోనల్ విభాగం మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, నెల్లూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, నెల్లూరు నగర నియోజకవర్గ మహిళా అధ్యక్షురారాలు తనూజారెడ్డి, నెల్లూరురూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు.