
సమస్యలు పరిష్కరించాలంటూ..
● విద్యుత్ భవన్ వద్ద ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు హజరత్తయ్య, జాకీర్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను నేరుగా వేతనాలివ్వడం ద్వారా సంస్థకు రూ.192 కోట్లు మిగులుతాయని, కానీ అందుకు భిన్నంగా యాజమాన్యం కాంట్రాక్టర్ ద్వారా చెల్లిస్తోందన్నారు. సంస్థకు నష్టమొచ్చేలా యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకుంటుందో అర్థం కావడం లేదని విమర్శించారు. గ్రేడ్ – 2 జేఎల్‌ఎంలను సర్వీసు రెగ్యులేషన్ చేయాలన్నారు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సంస్థను దశల వారీగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకపోతే విద్యుత్ జేఏసీ నిర్వహించే సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. సమ్మె సమయంలో కొత్త వారితో పనిచేయించుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పెంచలప్రసాద్, గిరిబాబు, నాగయ్య, హరినారాయణ, విజయరామిరెడ్డి, నాగరాజు, మహేంద్ర, రఘు, మౌలాలి, వసంత్, మహేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్, ఆటో యూనియన్ నాయకులు రాజా తదితరులు పాల్గొన్నారు.