
నిజాలు రాస్తే ‘సాక్షి’పై కక్ష సాధింపా?
కోవూరు: ప్రజా సమస్యలతోపాటు అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చే విధంగా నిజాలు రాస్తే ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధించడం విచారకరమని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కోవూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలను రాసిన విలేకరుల ఇళ్లల్లో మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ సోదాలు చేయడం, విచారణ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారు జామున ఇళ్లకు వెళ్లి నోటీసుల పేరుతో అలజడి సృష్టించడం ఏమిటని ప్రసన్న ప్రశ్నించారు. చంద్రబాబూ.. మీ పార్టీ నేతలు నకిలీ మద్యం తయారు చేయడం నిజం కాదా? నీ గ్యాంగ్‌తో రాష్ట్రం మొత్తం విక్రయించింది అబద్ధమా? అని నిలదీశారు. ఇవే నిజాలు కాబట్టే మీ పార్టీ నేతలపై కేసులు పెట్టారు. ఇవన్నీ నిజాలు కాబట్టే ‘సాక్షి’ పత్రిక నకిలీ మద్యం వ్యాపారం గురించి, అది తాగి చనిపోయిన వారి గురించి వాస్తవాలు వెల్లడించిందని గ్రామాల్లో, పట్టణాల్లో విషపూరిత మద్యం వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో ప్రజలకు చూపించింది. నిజాలను జీర్ణించుకోలేకనే.. విచారణ పేరుతో వేధింపులకు దిగుతుందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం తయారీకి కారణమైన పార్టీ నేతలతోపాటు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులపై చర్యలు తీసుకోవడం మాని, వాస్తవాలను రాసిన ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, జిల్లా బ్యూరో ఇన్‌చార్జి మస్తాన్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడం, మండల రిపోర్టర్ ఇంట్లో సోదాలు చేయడం మంచిది కాదన్నారు. నకిలీ మద్యం మాఫియాలు ఎవరి రక్షణలో పనిచేస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ దుర్మార్గాన్ని బయట పెట్టిన పత్రికను బెదిరించడం అంటే ప్రజల గొంతును నొక్కడమే అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాల్గో స్తంభం. ఆ స్తంభాన్నే కూలగొట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలేకరుల ఇళ్లల్లో
సోదాలు చేయడం అప్రజాస్వామ్యం
అర్ధరాత్రి పూట, తెల్లవారు జామున వెళ్లి నోటీసులా?
నకిలీ మద్యం తయారు చేసింది
నిజం కాదా?
నీ గ్యాంగ్‌తో అమ్మించింది అబద్ధమా?
వైఎస్సార్‌సీ పీఏసీ సభ్యుడు ప్రసన్నకుమార్‌రెడ్డి