
వినూత్నంగా చాంపియన్ ఫార్మర్ విధానం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: ఆధునిక వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న ఆదాయాల నేపథ్యంలో జిల్లాలో వినూత్నంగా చాంపియన్ ఫార్మర్ (వ్యవసాయ విజేతలు) అనే నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో వివిధ అంశాలపై సబ్‌కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నెలలో ఒక రోజు సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు. యానాదులు ఎక్కువగా ఉన్నందున వారికి అధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు. కేవలం భూ సంబంధ విషయాలే కాకుండా మిగిలిన అన్ని సమస్యలపై చర్చించాలన్నారు. మండల, డివిజనల్ స్థాయిలో పరిష్కారమయ్యే కేసులను జిల్లా కేంద్రం వరకు తీసుకురాకూడదన్నారు. జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఒక్క కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందజేయాలన్నారు. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన వ్యవసాయ విధానంలో భాగంగా జిల్లాలోని 722 గ్రామ పంచాయతీల నుంచి ఔత్సాహిక రైతులను ఎంపిక చేసి వారిని వ్యవసాయ విజేతలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.