
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరుబాట
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. కోవూరులోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్యనభ్యసించేందుకు 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అయితే సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనతో కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ చదవాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే, తమకొద్దంటూ ఎన్‌ఎంసీకి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లతో కళాశాలలకు జీవం వస్తుందన్నారు. వైద్య కళాశాలలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీల బిడ్డలు వైద్య విద్య చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. పోరుబాటలో భాగంగా కోటి సంతకాల సేకరణతోపాటు దశల వారీగా నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. యువత, మేధావులు, వామపక్షాలు తదితరులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రౌడీయిజం, దౌర్జన్యాలు చేస్తే జనం ఊరుకోరన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు, ఏపీఎల్‌డీఏ చైర్మన్ విజయకుమార్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, సీనియర్ నాయకులు రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, మండల కన్వీనర్లు అనూప్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సతీష్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శేషగిరిరావు, షాహుల్ తదితరులు పాల్గొన్నారు.