
పిల్లలకు అండగా ఉంటాం
● సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి
నెల్లూరు(అర్బన్): బాలభవిత (అర్లీ ఇంటర్‌వెన్షన్) కేంద్రంలోని పిల్లలకు అండగా ఉంటామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ పుట్టుకతో లోపాలున్న వారికి, గ్రహణమొర్రి, గ్రహణ శూల, సకాలంలో మాట్లాడలేకపోవడం, వినలేకపోవడం సమస్యలున్న పిల్లలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు.
పిల్లలకు గుండె ఆపరేషన్లు, రూ.లక్షల విలువ చేసే కాక్‌టెయిల్ ఇంప్లాంట్ ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తున్నారన్నారు. పిల్లలకు ఏమి అవసరమైనా సంస్థ తరఫున అండగా ఉంటామన్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా తమను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ యశ్వంత్, చిన్నపిల్లల డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ పావని, మేనేజర్ జమీర్, పారా లీగల్ వలంటీర్ శ్రీనివాసులు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.