
ఆస్తి కోసం వేధింపులు
● పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన బాధితులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆస్తి కోసం పిల్లలు వేధిస్తున్నారని పలువురు వృద్ధులు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 125 మంది విచ్చేసి ఫిర్యాదులను ఎస్పీ అజితకు అందజేశారు. ఆమె స్వయంగా అర్జీదారుల వద్దకెళ్లి మాట్లాడారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌బీ సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా వయసు 73 సంవత్సరాలు. చిన్న కుమారుడు బాగోగులు పట్టించుకోవడం లేదు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నాడని ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు.
● నాకు పిల్లల్లేరు. సోదరి కుమారుడైన కాకర్ల పెంచలయ్యను పెంచాను. అతను నా ఇల్లు, ఆస్తి ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చేజర్ల ప్రాంతానికి చెందిన 85 సంవత్సరాల వృద్ధుడు వినతిపత్రమిచ్చాడు.
● టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. అతడికి రూ.6 లక్షలు పంపాను. ఇప్పుడు స్పందించడం లేదని ఇందుకూరుపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వెల్లడించాడు.
● పుత్తూరు ప్రాంతానికి చెందిన హేమంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.4.50 లక్షలు తీసుకుని మోసగించాడని రాపూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● తన కుమార్తె ఆగస్టు నెల నుంచి కనిపించడం లేదని, ఆచూకీ కనుక్కోవాలని నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● భర్త, అత్తమామలు, ఆడపడుచులు అదనపు క ట్నం కోసం వేధిస్తున్నారు. భర్త మద్యం తాగొచ్చి ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని కందుకూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రం అందజేసింది.
● భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దగదర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. భర్తతో కలిసి మరిది బెదిరిస్తున్నాడు. నా కుమారుడిని తీసుకెళ్లేందుకు అత్త ప్రయత్నిస్తోంది. రక్షణ కల్పించాలని దగదర్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ వేడుకుంది.