దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి.. | - | Sakshi
Sakshi News home page

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

Oct 14 2025 6:57 AM | Updated on Oct 14 2025 6:57 AM

దూర ప

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

500 దాటిన అర్జీల సంఖ్య

నెల్లూరు రూరల్‌: ‘అయ్యా చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రికార్డు స్థాయిలో 505 అర్జీలు వచ్చాయి. అందులో అధికంగా రెవెన్యూ శాఖవి ఉన్నాయి.

చర్యలకు డిమాండ్‌

కండలేరు జలాశయంలో అక్రమంగా చేపల వేట సాగిస్తూ యానాదుల పొట్టకొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ కొందరు ముఠాగా ఏర్పడి చేపల వేట సాగిస్తున్నట్లు ఆరోపించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ జేడీని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మానికల మురళి, చెంబేటి ఉష, బిట్రా ప్రసాద్‌, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ నిరసన

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్‌ నేతలు కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు అంబేడ్కర్‌ మాదిగ, ఉపాధ్యక్షుడు ఉదయకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బిల్లులు విడుదల చేయాలంటూ..

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలంటూ ఆ యూనియన్‌ అధ్యక్షురాలు తుమ్మారెడ్డి రేవతి, కార్యదర్శి రెహానా బేగం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో భోజనం పెట్టడం కష్టమవుతోందన్నారు. సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

జీతాలు అందించాలి

జిల్లాలో సీహెచ్‌సీల్లో పనిచేసే శానిటేషన్‌ సిబ్బందికి ఆరునెలలుగా జీతాలు అందడం లేదంటూ ఎస్టీ, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చేమూరు రవికుమార్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఫస్ట్‌ ఆబ్జెక్ట్‌ అనే సంస్థ టెండర్‌ దక్కించుకుందన్నారు. ఇది ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బినామీగా తెలుస్తోందన్నారు. పలుమార్లు జిల్లా అధికారులను సంప్రదించిన ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో సురేఖ, కీర్తి, మౌనిక, సుమ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

భూ ఆక్రమణపై ఫిర్యాదు

తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొందరు బెదిరించి ఆక్రమించారని వలేటివారిపాళెం మండలం తూర్పు పోలినేనిపాళెం గ్రామస్తులు పోకూరు కోటయ్య కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తాను పుట్టు మూగవాడినని, భార్యకు పక్షవాతం వచ్చిందని అర్జీలో పేర్కొన్నారు. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కొండయ్య, సింహాద్రి, పాపారావు, సింగయ్య, ముసలయ్య మమ్మల్ని కొట్టి భూమిని ఆక్రమించినట్లు చెప్పారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. వీఆర్వో, సర్వేయర్‌ తప్పుడు రిపోర్టులు ఇచ్చారన్నారు. ఎస్సై దగ్గరికి వెళితే స్టేషన్‌ పరిధిలో కనిపిస్తే జైల్లో వేస్తానని చెప్పారన్నారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

వేలం నిర్వహించకుండానే..

బహిరంగ వేలం నిర్వహించకుండా విష్ణు ఆలయానికి సంబంధించిన టేకుతో సహా దాదాపు రూ.40 లక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను అమ్ముకున్నారని తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి చెందిన గండవరపు వెంకటరామిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ జ్వాలాముఖి దేవస్థానం చైర్మన్‌ భర్త కోడూరు శ్రీనివాసులురెడ్డి అలియాస్‌ బాబిరెడ్డి ప్రజలను భయపెట్టి టేకుతో తయారుచేసిన తలుపులు, కిటికీలు, చెక్కలు తదితరాలు అమ్ముకుని దోచేస్తున్నారన్నారు. ఈఓ తాతా శ్రీనివాసరావు చిన్న ఘటనలపై ప్రజలపై కేసులు పెడుతుంటారని, కుంభకోణం జరిగినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..1
1/6

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..2
2/6

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..3
3/6

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..4
4/6

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..5
5/6

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..6
6/6

దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement