
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,626 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,304 మంది భక్తులు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
డీసీపల్లిలో
1058 బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకుబ బోర్డు వేలం కేంద్రంలో 1058 బేళ్లను మంగళవారం విక్రయించామని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 1274 బేళ్లు రాగా, వాటిలో 1058ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 1,32,831.3 కిలోల పొగాకును విక్రయించగా.. రూ.2,96,47,128.20 వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్ట ధర రూ.330.. కనిష్ట ధర రూ.80.. సగటు ధర రూ.223.19గా నమోదైందని వివరించారు. పది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.330
కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.330 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 978 బేళ్లను తీసుకురాగా, 905ను కొనుగోలు చేయగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్ మాట్లాడారు. కనిష్ట ధర రూ.79.. సరాసరిన రూ.260.66గా నమోదైందన్నారు. 19 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.
ఇంట్లో ఎవరూ లేని
సమయంలో..
● పోలీస్ కాలనీలో దొంగతనం
● బంగారం, వెండి అపహరణ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం పోలీసు కాలనీ ఐదో వీధిలో మంజులాదేవి, వెంకటేశ్వర్లు దంపతులు ఏడేళ్లుగా నివాసముంటున్నారు. ఆయన గుండెకు స్టెంట్‌ను రెండు నెలల క్రితం వేశారు. అప్పటి నుంచి తమ స్వగ్రామమైన వాకాడులో వారు ఉంటున్నారు. పది రోజుల క్రితం ఇంటికి దంపతులొచ్చి శుభ్రం చేసి వెళ్లారు. ఈ తరుణంలో ఇంటి తలుపులను గుర్తుతెలియని దుండగులు సోమవారం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాల్లోని లాకర్లలో ఉన్న 34 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, 150 పట్టుచీరలను అపహరించుకెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో బాధితు లకు యజమాని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇంటికి చేరుకొని పరిశీలించగా.. బంగారు, వెండి వస్తువులు, చీరలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా ఒకేషనల్
కో ఆర్డినేటర్ పరిశీలన
ఆత్మకూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవుల సందర్భంగా సమగ్ర శిక్ష, స్కిల్ డెవలప్‌మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఒకేషనల్ కో ఆర్డినేటర్ మల్లికార్జున మంగళవారం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు నేర్చుకున్న అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు. వృత్తి విద్య శిక్షకుడు గొల్లపాటి యజ్రా, నాగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

శ్రీవారి దర్శనానికి 24 గంటలు