
తవ్వుకో.. దోచుకో..!
● సర్వేపల్లిలో ఆగని గ్రావెల్ దందా
● పట్టించుకోని అధికారులు
వెంకటాచలం: మండలంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ రవాణాపై సోషల్ మీడియా, పత్రికల్లో నిత్యం కథనాలు ప్రచురితమవుతున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని సర్వేపల్లి, గుడ్లూరువారిపాళెం, కాకుటూరు, వెంకటాచలం, గొలగమూడి, రామదాసుకండ్రిగ గ్రామాల్లో గల చెరువుల్లో గ్రావెల్‌ను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. తాజాగా ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెంలోని చెరువుల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా గ్రావెల్‌ను తవ్వుతున్నారు. దీన్ని మనుబోలు మండలం కాగితాలపూరు సమీపంలోని రొయ్యల గుంటల వద్దకు తరలిస్తున్నారు.
అధికారుల మొద్దు నిద్ర
చెరువుల్లో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నా, అధికారులు మొద్దు నిద్రను వీడటంలేదు. సామాన్యులెక్కడైనా ట్రాక్టర్ మట్టి తోలుతుంటే వెంటనే వాలిపోయే వీరు.. గ్రావెల్ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడంలేదని ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం గ్రామాల రైతులు మండిపడుతున్నారు. గ్రావెల్ గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందుతున్నా, అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.

తవ్వుకో.. దోచుకో..!