
దివ్యరూపం.. మహాతేజం
తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో మలయప్ప స్వామి దేదీప్యమానంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో బ్రహ్మోత్సవాల్లో మూడో స్నపన తిరు మంజనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సేద తీరారు. సాయంత్ర వేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో దివ్య మంగళరూపంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు వాహన సేవల్లో కళాకారులు, వివిధ ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో కళాకారులు అభినయం భక్తులను ఆకట్టుకుంది. ఆలయంతోపాటు ఫల, పుష్ప ప్రదర్శన శాలలోని పుష్ప, విద్యుత్ అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నాదనీరాజనం, ఆస్థాన మండపంలో కళాకారులు భక్తి, సంగీత కార్యక్రమాలు అలరించాయి. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
రథోత్సవానికి సర్వం సిద్ధం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7.00 గంటల నుంచి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
చక్రస్నానం కోసం
పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు.
ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ సేవలో శ్రీనివాసుడి కటాక్షం
తిరుమంజనంలో
సేదతీరిన శ్రీవారు
నేడు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
రేపటి చక్రస్నానంతోముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

దివ్యరూపం.. మహాతేజం

దివ్యరూపం.. మహాతేజం