
సర్వే రిపోర్ట్ మాయాజాలం
● కొన్ని రిజిస్ట్రేషన్లకు
సబ్మిట్ చేయడం తప్పనిసరి
● నకిలీవి సృష్టిస్తున్న కేటుగాళ్లు
● ఓ కార్యాలయంలో ఇచ్చినట్లు వెలుగులోకి..
నెల్లూరు సిటీ: కేటుగాళ్లు నకిలీ సర్వే రిపోర్ట్‌లను సృష్టించి జేబులు నింపుకొంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో సృష్టించి క్రయదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెల్లూరు ఆర్‌ఓ, స్టోన్‌హౌస్‌పేట, బుజబుజ నెల్లూరు, కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని రిజిస్ట్రే షన్లకు తప్పనిసరిగా సర్వే రిపోర్ట్‌ను సబ్మిట్ చేయాలి. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సర్వేయర్లు ఇచ్చేది సరిపోయేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చే దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ, కాలువల పక్కనుండే స్థలాలు, సర్వే నంబర్లు భిన్నాలు అయినప్పుడు పలు కారణాలతో సర్వే రిపోర్టును క్రయదారులు పొందుతారు. సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు.
నకిలీ కలకలం
జిల్లాలో మండల, డిప్యూటీ సర్వేయర్లు కలిపి 80 మంది వరకు ఉన్నారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి డాక్యుమెంట్ సర్వే నంబర్ల ప్రకారం స్థలం హద్దులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించి రిపోర్టు ఇస్తారు. కాగా బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ సర్వే రిపోర్ట్‌ల వ్యవహారం కలకలం రేపింది. దీనిని గుర్తించిన ఆ సబ్ రిజిస్ట్రార్ సర్వేయర్‌కు ఫోన్ చేసి ఇది మీరు ఇచ్చిందేనా అని ప్రశ్నిస్తే.. తాను ఇవ్వలేదని, సంతకం ఫోర్జరీ చేశారని చెప్పడం గమనార్హం. నకిలీదిగా గుర్తించి రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు. కాగా పదుల సంఖ్యలో నకిలీ సర్వే రిపోర్ట్‌లను కొందరు కేటుగాళ్లు సృష్టించి జిల్లా వ్యాప్తంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిసింది.
రూ.10 వేలిస్తే..
ఈ స్థలం తమదేనని ప్రభుత్వం ద్వారా నిర్ధారించేందుకు యజమాని చలానా కట్టాలి. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి రిపోర్ట్‌ను సిద్ధం చేస్తారు. అయితే కొందరు రిపోర్ట్ ఇవ్వాలంటే రూ.10 వేలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేటుగాళ్లు నకిలీవి సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. పలువురు ప్రభుత్వ సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు థర్డ్ పార్టీగా బంధువులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.