
వేతన వెతలు
● చాలీచాలని జీతాలతో ఏళ్లుగా చాకిరీ
● కనికరం చూపని ప్రభుత్వం
● కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం గాలికి
దుత్తలూరు: సమగ్రశిక్ష, విద్యాశాఖలో విధులు నిర్వర్తించే క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్‌ఎమ్టీ), మండల లెవల్ అకౌంటెంట్లు, ఎమ్మైఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వేతన వెతలను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను ఎలా సాగించాలో తెలియక మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనమివ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. వేతన అసమానతలను పెంచేలా జీఓ నంబర్ రెండును అమలు చేస్తోంది. ఇది తమ ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ తీరు..
జిల్లాలోని 38 మండలాల్లో 286 మంది సీఆర్‌ఎమ్టీలు.. వందకుపైగా ఎమ్మైఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల లెవల్ అకౌంటెంట్లు పనిచేస్తున్నారు. వీరందరూ 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో నెలకు రూ.18,500 వేతనం లభించేది. ఆ తర్వాత 2020లో వీరి జీతాన్ని రూ.23,500కు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెంచారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
వీరి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్‌ను వర్తింపజేయరాదంటూ జీఓను ఈ ఏడాది జనవరి ఆరున సర్కార్ జారీ చేసింది. ప్రభుత్వ శాఖలకు మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులే అర్హులని పేర్కొంది. ఈ పరిణామంతో పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనల్లేవని పేర్కొంటున్నారు.
వర్తించని పథకాలు
వాస్తవానికి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కారు. ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొన్ని పథకాలు వీరికి వర్తించలేదు. ఫలితంగా ఏమి చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో వీరు కొట్టామిట్టాడుతున్నారు. రిటైర్మెంట్ వయస్సును పెంచడంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించి.. తమను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
దుత్తలూరులోని విద్యాశాఖ కార్యాలయం
సమగ్రశిక్ష, విద్యాశాఖలో అత్యంత కీలకంగా పనిచేసే క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్‌ఎమ్టీ), మండల లెవల్ అకౌంటెంట్లు, ఎమ్మైఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని జీతాలతో బతుకుబండినీడుస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరిపై ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపడంలేదు.
కచ్చితమైన జాబ్ చార్టును అమలు చేయాలి
చాలీచాలని వేతనాలతో విధులను నిర్వర్తిస్తున్నారు. నిర్దిష్టమైన జాబ్ చార్టు లేదు. ఆగస్ట్ నెల జీతం నేటికీ అందలేదు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.
– తుమ్మల నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నేత

వేతన వెతలు