
పరాకాష్టకు కూటమి కుట్రలు
● నాడు హత్యాయత్నం చేశారంటూ ఇప్పుడు టీడీపీ నేత ఫిర్యాదు
● వాస్తవాలు పరిశీలించకుండానే
19 మందిపై అక్రమ కేసు
● డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్
వీరి చలపతి అరెస్ట్
సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల కుట్రలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం దాడి చేశారంటూ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదును విచారించకుండానే హడావుడిగా డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతితో పాటు మరో 18 మందిపై అక్రమ కేసును నమోదు చేశారు. ఆయన్ను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.
అప్పుడెప్పుడో దాడి చేశారంట..!
కొడవలూరు మండలం నార్తురాజుపాళేనికి చెందిన కరకటి మల్లికార్జున టీడీపీ నేత. 2023, ఏప్రిల్ 23న వీరి చలపతి మరో 18 మంది తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తనతో పాటు కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారని, ఆస్తులను ధ్వంసం చేశారంటూ కొడవలూరు పోలీసులకు మల్లికార్జున శనివారం ఫిర్యాదు చేశారు. వాస్తవాలను విచారించకుండా.. ఫిర్యాదు అందిందే తరువాయిగా కూటమి నేతలను మెప్పించేందుకు వీరి చలపతి, శ్రీనివాసులురెడ్డి, బొచ్చు శ్రీనివాసులు, సాల్మన్, దాస్, అనపల్లి ఉదయ్‌భాస్కర్, సురేష్, సుబ్రహ్మణ్యం, రాజేష్, సుశాంత్, టోనీ, దినేష్, మోచ ర్ల రమేష్, చిన్నప్ప, దారా మధు, పానేటి శ్రీకాంత్, అరవ సంపత్, కల్యాణ్, బద్రిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసును కొడవలూరు పోలీసులు నమోదు చేశారు.
విచిత్ర వైఖరి
తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. విచారణ జరిపి పోలీసులు చర్యలు చేపడతారు. అయితే కొడవలూరు పోలీసులు అందుకు భిన్నంగా ఫిర్యాదు అందిందే తడువుగా కేసును బనాయించారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని వీరి చలపతి శనివారం రాత్రి కలిశారు. కొద్దిసేపటి అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా, మార్గమధ్యలో ఆయన్ను కొడవలూరు పోలీసులు అదుపులోకి తీసుకొని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సమక్షంలో కొడవలూరు పోలీసులు విచారించి అరెస్ట్ చూపించారు. హుటాహుటిన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి ప్రసన్నకుమార్‌రెడ్డి చేరుకున్నారు. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని ఆరాతీశారు. చలపతిని అరెస్ట్ చేశారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. కార్యాలయం వద్దకు ఎవరూ రాకుండా గేట్లను పోలీస్ అధికారులు మూసేశారు. వివరాలు తెలుసుకునేందుకు మీడియా యత్నించగా అడ్డుకున్నారు.
ఖాకీల అత్యుత్సాహం
వీరి చలపతిపై కోవూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి 41ఏ నోటీస్‌ను ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో ఖాకీలు అత్యుత్సాహం ప్రదర్శించి పాత కేసును తిరగదోడి.. అక్రమంగా అరెస్ట్ చేశారు.

పరాకాష్టకు కూటమి కుట్రలు