
ఉపాధి సిబ్బంది తీరే వేరయా..
● మొన్న పరస్పర దూషణలు
● తాజాగా కార్యాలయాన్ని
తెరిచే వెళ్లిన వైనం
దుత్తలూరు: దుత్తలూరులో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది తీరు వివాదాస్పదమవుతోంది. వరుస వివాదాల్లో చిక్కుకున్నా, వీరి ప్రవర్తనలో మార్పు రాకపోగా, శ్రుతి మరింత తప్పుతోంది. రెండు రోజుల క్రితం ఇద్దరు సిబ్బంది పరస్పరం దూషించుకొని రచ్చకెక్కగా, తాజాగా వీరి నిర్లక్ష్యం మరొకటి బయపటడింది. ఆఫీస్‌కు శుక్రవారం వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది.. కార్యాలయ తెలుపులు తెరిచారు. అనంతరం ఏపీడీ మృదుల విచారణ నిమిత్తం వీరందరూ కావలి వెళ్లారు. అయితే తిరిగి వీరు కార్యాలయానికి రాలేదు. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కార్యాలయ తలుపులు తెరిచే దర్శనమిచ్చాయి. విలువైన కంప్యూటర్లు, పలు రకాల ఫైళ్లు, సామగ్రి ఉందనే కనీస స్పృహ వీరికి కరువైంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయమై ఏపీడీని సంప్రదించగా, తనకు విషయం తెలియదని, కార్యాలయంలో ఎలాంటి సామగ్రి, రికార్డులు పోయినా ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.