
కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
● రామిరెడ్డి కుటుంబాన్ని
పరామర్శించిన జూపూడి
కావలి(అల్లూరు): కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన కావలికి విచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు ఎక్కువైనట్లు చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి నీచ రాజకీయం చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రశ్నిస్తుందన్నారు. తాము ఎక్కడికెళ్లినా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలన్నారు. రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కావలి బుడంగుంట ఎస్సీ కాలనీలో విద్యుత్ అధికారులు చేసిన దాడి సరైనది కాదన్నారు. పేద ప్రజలపై దుశ్చర్య సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, కుందుర్తి శ్రీను, కృష్ణారెడ్డి, కామరాజు, మాల్యాద్రి, పుల్లయ్య, పద్మ, కల్యాణి, రాఘవులు, కృష్ణమూర్తి, మద్దిబోయిన రఘు, కె.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.