గుండెల్ని పిండే విషాదం | - | Sakshi
Sakshi News home page

మృత్యువై దూసుకొచ్చిన ఇసుక టిప్పర్‌

Sep 18 2025 7:43 AM | Updated on Sep 18 2025 1:08 PM

 గుండ

గుండెల్ని పిండే విషాదం

పరామర్శకు వెళ్తున్న ఏడుగురి ప్రాణాలను కబళించి

మృతులందరూ బంధువులే

కకావికలమైన కుటుంబాలు

అనాథలైన పిల్లలు

విధి.. ఐదు కుటుంబాల్లో గుండెలు పిండే విషాదాన్ని నింపింది. అందరూ దగ్గరి బంధువులే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు కారులో బయల్దేరిన వీరిని ఇసుక టిప్పర్‌ మృత్యువై కబళించింది. మృతుల్లో రెండు కుటుంబాల భార్యాభర్తలు ఉన్నారు. మహిళలిద్దరూ తోబుట్టువులు. వీరి మరణంతో ఆ దంపతుల బిడ్డలు అనాథలయ్యారు. అంతులేని విషాద ఘటనకు సంబంధించి బంధువులెవర్ని కదిలించినా కన్నీటి సుడులు.. గుండెలవిసే ఆవేదన పెల్లుబుకుతోంది. అధికార పార్టీ నేతల ధనదాహానికి ఏడు నిండు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఆ కుటుంబాలు కకావికలమయ్యాయి.

సంగం / నెల్లూరు (క్రైమ్‌) / ఆత్మకూరు / నెల్లూరు(పొగతోట): ఇసుకాసురుల ధనదాహం.. ఏడుగురి ప్రాణాలను బలిగొంది. మద్యం మత్తులో డ్రైవర్‌ భారీగా ఇసుక లోడ్‌తో మితిమీరిన వేగంతో రాంగ్‌రూట్‌లో వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో మృత్యుఘోష మిన్నంటింది. సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో మృతుల కుటుంబాలు కకావికలమయ్యాయి.

బావను పరామర్శించేందుకెళ్తూ..

బాలవెంగయ్య, తాళ్లూరు రాధమ్మ, చల్లగుండ్ల లక్ష్మి అన్నా చెల్లెళ్లు. మరో చెల్లెలు లక్ష్మి భర్త మధు ప్రస్తుతం వింజమూరు మండలం తక్కెళ్లపాడులో ఉంటున్నారు. మధు ఈ నెల 16వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆత్మకూరు ప్రభుత్వాస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు శేషం బాలవెంగయ్య, వదిన శేషం శారమ్మ, బావలు, చెల్లెళ్లు తాళ్లూరు రాధమ్మ, శ్రీనివాసులు దంపతులు, చల్లగుండ్ల లక్ష్మి, శ్రీనివాసులు దంపతులు బుధవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో నెల్లూరు నుంచి తమ కారులో బయల్దేరారు. 

మరికొన్ని నిమిషాల్లో చేరుకుంటారనుకున్న వీరి కారును ఇసుక అక్రమ రవాణా సాగించే టిప్పర్‌ మృత్యుశకటమై కబళించేసింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో బాలవెంగయ్య మృతి చెందడంతో ఆయన భార్య శారదమ్మ తమ పరిస్థితి ఏమిటంటూ, తన కుమార్తెల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయంటూ కన్నీరుమున్నీరుగా గుండెలవిసేలా రోదించారు. ఇసుక టిప్పర్‌ తమ కుటుంబాలను సర్వనాశనం చేసిందని వారి బంధువులు శాపనార్థాలు పెట్టారు. ఈ బిడ్డల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల ధనదాహంతోనే ఇలా జరిగిందని, రెండు కుటుంబాలు సర్వనాశనమయ్యాయని బంధువులు విలపిస్తున్నారు.

బంధువుల ఆర్తనాదాలతో విదారకం

పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంతో వారి తరఫు బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అందరూ దళిత కుటుంబీకులే. పరామర్శకు వస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడడం చూసిన వారి హృదయాలను కలిచి వేసింది. పోస్టుమార్టం జరుగుతున్న ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకరంగా మారింది. ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, ఏఎస్పీ సౌజన్య, సీఐ నాగేశ్వరమ్మ, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్‌, సంగం, ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి, ఎం గంగాధర్‌, పలు స్టేషన్ల ఎస్సైలు హాజరయ్యారు.

ఊరూరా విషాదఛాయలు

గుర్రాలముడుగు సంఘంలో విషాదఛాయలు అలముకున్నాయి. శారమ్మ, బాలవెంగయ్య కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గుండెలవిసేలా రోదిస్తుండడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. విషయం తెలుసుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. సాంబశివరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులను, బంధువులను ప్రత్యేక వాహనంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. శారమ్మ, బాలవెంగయ్య అందరితో కలివిడిగా ఉంటేవారని అలాంటి వారిని మృత్యువు కబళించడం జీర్ణించుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్నీ విధాలా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

స్టోన్‌హౌస్‌పేట సాలివీధిలో..

రోడ్డు ప్రమాదంలో తాళ్లూరు శ్రీనివాసులు, రాధమ్మ దంపతులు మృతి చెందడంతో వడ్డిపాళెంతో పాటుగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సాలివీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసులు దంపతులు కొంతకాలంగా సాలివీధిలో శ్యామ్‌ ఫాస్ట్‌ఫుడ్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఫంక్షన్లకు ఆర్డర్‌లపై టిఫిన్స్‌ సప్లయి చేసేవారు. నాణ్యమైన ఫుడ్‌ అందిస్తుండటంతో అనతికాలంలోనే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ బాగా క్లిక్‌ అయింది. ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాలకు చెందిన వారు టిఫిన్‌ చేసేందుకు వచ్చేవారు. అందరితో శ్రీనివాసులు కలివిడిగా ఉండేవారు. ఎప్పటిలాగే టిఫిన్‌ చేసేందుకు కస్టమర్లు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్దకు వచ్చారు. సెంటర్‌ మూసి ఉండటంతో పక్క దుకాణదారుల ద్వారా విషయం తెలుసుకుని బాధపడ్డారు.

ఇందుకూరుపేటలో..

ఇందుకూరుపేట: సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందుకూరుపేట దళితవాడ (అరుంధతీయవాడ)కు చెందిన చల్లగుండ్ల శ్రీనివాసులు, భార్య లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందడంతో ఇందుకూరుపేటలో విషాదం నెలకొంది. రోజులాగే కూలీలను ఎక్కించుకొని నరుకూరు రోడ్డులో వదిలారు. అక్కడ నుంచి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు ఆటోలో నెల్లూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమార్తె చందు ప్రియ, కుమారుడు విశ్వంత్‌ స్కూల్‌కు వెళ్లారు. భార్యాభర్తలు ఇరువురు బంధువులతో కలిసి కారులో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. అప్పటి వరకు తమ కళ్ల ఎదుటే ఉన్న శ్రీనివాసులు, లక్ష్మి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో దళితవాడ వాసులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోవడంతో బిడ్డలిద్దరు అనాథలుగా మిగిలిపోయారు.

మేకపాటి విక్రమ్‌రెడ్డి సంతాపం

పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సమీప బంధువులు ఏడుగురు మృతి చెందడం బాధాకరమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆయన పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ప్రమాద స్థలం వద్ద సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరే కుటుంబంలోనూ జరగకూడదన్నారు. తల్లిదండ్రులను, మరో కుటుంబంలో పిల్లలను కోల్పోయిన వారి బాధ తీర్చలేనిదని, వారికి ప్రభుత్వ పరంగా జరగాల్సిన అన్ని సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సంతాపం..

నెల్లూరు జిల్లాలో కూటమి నేతల ధనదాహం కారణంగా ఇసుక అక్రమ రవాణా ఏడుగురు ప్రాణాలను బలి తీసుకున్న విషాదకర ఘటన బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి బంధువులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

నా భర్తను చూపించండయ్యా...

తన భర్త బాలవెంగయ్య మృతి చెందాడని తెలుసుకున్న అతని భార్య శారదమ్మ ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపిస్తూ.. నా భర్తను చూపించండయ్య అంటూ గుండెలవిసేలా రోదిస్తూ కనిపించిన అందరిని పట్టుకుని అడుగుతుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. కారులో విగతజీవి అయి మాంసం ముద్దగా ఉన్న బాలవెంగయ్య మృతదేహాన్ని చూపలేక పోలీసులు, కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.

కన్నీరు పెట్టిన తనయుడు

తల్లి శేషం శారమ్మ మృతి చెందడంతో కుమారుడు తేజ కన్నీరుమున్నీరుగా విలపించారు. నెల్లూరు నుంచి వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడ్ని ఓదార్చలేకపోయారు. తండ్రి చనిపోయాడు. ఈ రోజు తల్లి కూడా పోయింది.. నాకెవరు దిక్కు అంటూ బోరున విలపించాడు.

డ్రైవర్‌ నా కొడుకే..

అయ్యా డ్రైవర్‌ బ్రహ్మయ్య నా కొడుకే.. ఎక్కడున్నాడో చూపించండయ్యా అంటూ అతని తల్లి వెంకట రమణమ్మ, అక్క పార్వతి కన్నీరుమున్నీరుగా విలపించారు. నా కొడుకు బ్రహ్మయ్యకు బాల వెంగయ్యతో పరిచయం ఉండడంతో కారు డ్రైవింగ్‌ కోసం ఆత్మకూరుకు వెళ్లాలని ఉదయాన్నే పిలుచుకెళ్లాడు. అంతే తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ.. చేతికంది వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారంటూ విలపిస్తుంటే.. స్థానికులు సైతం కంటతడి పెట్టారు.

ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్పీ

సంగం: రోడ్డు ప్రమాద ఘటనా స్థలిని బుధవారం రాత్రి ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. రోడ్డు ప్రమాద కారణాలను, మృతుల వివరాలు, ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్‌ డ్రైవర్‌, యజమాని వివరాలను స్థానిక సీఐ కె. వేమారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని, ఇప్పటికే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 గుండెల్ని పిండే విషాదం 1
1/6

గుండెల్ని పిండే విషాదం

 గుండెల్ని పిండే విషాదం 2
2/6

గుండెల్ని పిండే విషాదం

 గుండెల్ని పిండే విషాదం 3
3/6

గుండెల్ని పిండే విషాదం

 గుండెల్ని పిండే విషాదం 4
4/6

గుండెల్ని పిండే విషాదం

 గుండెల్ని పిండే విషాదం 5
5/6

గుండెల్ని పిండే విషాదం

 గుండెల్ని పిండే విషాదం 6
6/6

గుండెల్ని పిండే విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement