
జింకను వధించిన కేసులో రిమాండ్
నెల్లూరు(అర్బన్): రూరల్ మండల పరిధిలోని ఆమంచర్ల ఎస్టీ కాలనీకి చెందిన నంబూ రి నాగయ్య అనే వ్యక్తి బుధవారం మట్టెంపాడు వద్ద ఉచ్చు బిగించి చుక్క ల జింకను వధించాడు. మాంసాన్ని అక్కడే అమ్ముతుండగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. రేంజ్ ఆఫీసర్ మాల్యాద్రి ఆధ్వర్యంలో ఆమంచర్ల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసులు, దొంతాలి బీట్ ఆఫీసర్ మనోజ్‌కుమార్ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి నాగయ్యను పట్టుకున్నారు. కిలో జింక మాంసం, తల, చర్మంతో సహా స్వాధీనం చేసుకుని నెల్లూరులోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అనంతరం నెల్లూరులో కోర్టు వారికి అప్పగించగా ముద్దాయికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాల్యాద్రి మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి
ఆత్మకూరు: బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది. ఆత్మకూరు డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంగళరెడ్డి వింజమూరు మార్గంలో బస్సును తీసుకెళ్లాడు. తిరిగి ఆత్మకూరుకు వస్తున్న క్రమంలో అప్పటికే వంద మంది పైనే జనం ఉన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితమంటూ ప్రకటించి దానికి తగిన బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో గంటల కొద్ది వేచిచూస్తున్న మహిళలు వచ్చిన బస్సులోనే ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. నబ్బీనగరం వద్ద పలువురు ప్రయాణికులు ఆత్మకూరుకు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఆ బస్సు వచ్చింది. స్థలం లేకపోవడంతో అక్కడి వారు చేయి చూపించినా ఆపకుండా డ్రైవర్ ముందుకు వచ్చేశాడు. దీంతో ఆ గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి మోటార్‌బైక్‌పై వచ్చి బస్సును క్రాస్ చేసి అడ్డుగా పెట్టాడు. బస్సు ఎందుకు గ్రామంలో ఆపలేదంటూ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. అతని తల, చేతికి గాయాలయ్యాయి. పలువురు సర్ది చెప్పడంతో వెంగళరెడ్డి గాయపడినా బస్సును ఆత్మకూరుకు తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్‌కే జిలానీ కేసు నమోదు చేశారు.
అదనపుకట్నం కోసం వేధింపులు
నెల్లూరు(క్రైమ్): అదనపుకట్నం కోసం వివాహితను ఇంటి నుంచి గెంటేయడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. వెంకటరెడ్డినగర్‌కు చెందిన బింధు మాధవికి కావలికి చెందిన మహేష్‌తో గతేడాది పెద్దల సమక్షంలో వివాహమైంది. అప్పుడు వధువు కుటుంబ సభ్యులు కట్న కానుకల కింద రూ.1.50 లక్షల నగదు, 13 సవర్ల బంగారం మహేష్ కుటుంబానికి ఇచ్చారు. రెండునెలలు వారి కాపురం సజావుగా సాగింది. అనంతరం భర్త, అత్తింటివారు అప్పులున్నాయని రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలని మాధవిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో అత్తింటివారు ఆమెను పుట్టింట్లో వదిలారు. అప్పటి నుంచి ఆమె పెద్దల ద్వారా మాట్లాడినా వారిలో మార్పురాలేదు. బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జింకను వధించిన కేసులో రిమాండ్