
రైతన్న గోడు పట్టని సీఎం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతున్నా.. మాటలతో సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని మహ్మదాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. తనను కలిసిన రైతులతో వివిధ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో క్వింటాల్ ఉల్లి ధరలు రూ.3500 ఉండగా, ఇప్పుడు రూ.600కు పతనమయ్యాయని చెప్పారు. వరి పండించిన రైతులు గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సూపర్‌సిక్స్ పథకాల్లో కొన్నింటిని అసలు పట్టించుకోకపోగా, మిగిలిన వాటిని తూతూమంత్రంగా అమలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా అందక రైతులు నానా అగచాట్లు పడుతుంటే, చంద్రబాబు మాత్రం పూటకో మాట మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి నిర్మిస్తే, వాటిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం రాష్ట్ర ప్రజలను కలిచివేస్తోందని తెలిపారు.
చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలు, మీడియా విషప్రచారానికి తెరలేపాయని పేర్కొన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు వీల్లేకుండా, వారి ఆశలపై నీరుజల్లుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలే మేలైనవిగా ప్రచారం చేయించుకుంటున్నారని విమర్శించారు. రూ.లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రచారార్భాటంలో చూపే చొరవ కార్యరూపంలో లేదని ఎద్దేవా చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం పార్టీ నేత, సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి తల్లి పెంచలమ్మ దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, కరిపరెడ్డి కృష్ణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, మాలకొండారెడ్డి, కోనం బ్రహ్మయ్య, కమలాకర్‌రెడ్డి, రమణారెడ్డి, లచ్చారెడ్డి, చెంచుకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.