అయ్యోర్లకు పోస్టింగ్‌ ఎక్కడో? | - | Sakshi
Sakshi News home page

అయ్యోర్లకు పోస్టింగ్‌ ఎక్కడో?

Sep 18 2025 7:43 AM | Updated on Sep 18 2025 7:43 AM

అయ్యో

అయ్యోర్లకు పోస్టింగ్‌ ఎక్కడో?

క్లస్టర్లు, రిటైర్‌మెంట్‌ స్థానాల్లో పోస్టింగ్‌

జిల్లాలో ఆగస్ట్‌ వరకు రిటైరైన ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకుని కొత్త టీచర్లకు పోస్టింగ్‌ ఇస్తాం. ఇప్పటికే రిటైర్‌మెంట్‌తో కొన్ని స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేస్తాం, మిగిలిన కొత్త టీచర్లను ఆయా మండలాల్లోని క్లస్టర్లకు కేటాయిస్తాం. అక్కడి నుంచి వారి సేవలను వినియోగించుకుంటాం. సీనియారిటీ విషయంలో అన్యాయం జరగదు.

– ఆర్‌.బాలాజీరావు, డీఈఓ

నెల్లూరు(టౌన్‌): కొత్త ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. జిల్లాలో పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసి ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం హడావుడిగా ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏలు) సర్‌ప్లస్‌లో ఉండగా వారిని క్లస్టర్లకు కేటాయించారు. కొత్తగా 542 మంది ఎస్‌ఏలు జిల్లాకు రానున్నారు. వీరి నియామకం కోసం జిల్లాలో ఎక్కడా ఖాళీల్లేవు. దీంతో క్లస్టర్లకు కేటాయించిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా 400కు పైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 115కు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ క్లస్టర్లలో 532 పోస్టులను కేటాయించింది. జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు సెలవు పెడితే వారికి విధులు కేటాయించనున్నారు. దీంతోపాటు రిటైరైన వారి స్థానంలో క్లస్టర్లలో ఉన్న అయ్యోర్లను ఆ పాఠశాలకు పంపించే ఆలోచనలో విద్యాశాఖ అధికారులున్నారు.

అలా చేయకుండా..

సాధారణంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే సమయంలో రీ అపోర్ష్‌మెంట్‌ చేసిన తర్వాతే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అయితే ప్రభుత్వం హడావుడి, హంగామా కారణంగా జిల్లాలో అవసరానికి మించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మిగులు పోస్టులను పరిగణలోకి తీసుకోలేదు. ఖాళీలను పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో 673 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీరిలో 657 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. అభ్యర్థులు లేరనే కారణంతో 16 పోస్టులను ఖాళీగా ఉంచారు. అయితే మే, జూన్‌ నెలల్లో ఉపాధ్యాయులకు రీ అపోర్ష్‌మెంట్‌ జరిగింది. మిగులు ఉపాధ్యాయులకు ఖాళీ పోస్టులున్న పాఠశాలల్లో అవకాశం కల్పించారు. జిల్లాలో 192 మంది స్కూల్‌ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌ ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. వీరు, కొత్తగా వచ్చే 542 మంది ఎస్‌ఏలను క్లస్టర్లకే పరిమితం చేయనున్నట్లు తెలిసింది. అయితే సర్‌ప్లస్‌లో ఉన్న వారిని ఎస్జీటీ పోస్టులకు పంపనున్నారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు.

వారిలో ఆందోళన

కొత్తగా వచ్చే స్కూల్‌ అసిస్టెంట్లకు జిల్లాలో రిటైరైన వారి స్థానంలో పోస్టింగ్‌ ఇస్తే ఇప్పటికే క్లస్టర్లలో ఉన్న టీచర్లు వారి కంటే జూనియర్లవుతారు. దీంతో పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.

పబ్లిసిటీ పిచ్చితో..

కొత్త ఉపాధ్యాయ నిమామకంలో ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది. నియామకపత్రాలను ఈనెల 19న విజయవాడలో సీఎం చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఎంపికై న వారు ఒక సహచరుడిని తీసుకుని రావొచ్చని ప్రకటించారు. మొత్తం 1,314 మంది కానున్నారు. వీరంతా గురువారం వెంకటాచలం మండలం గొలగమూడిలో రిపోర్టు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి అక్కడ ఉంచి మరుసటి రోజు బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్లనున్నారు. ఇందుకు 31 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. రూ.13.02 లక్షలకు పైగా ఖర్చువుతుంది. దీంతోపాటు అందరికీ అల్పాహారం, భోజనాలు, వసతులు తదితర వాటికి మరో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు అవ్వొచ్చు. అంటే జిల్లాకు రూ.18 లక్షల నుంచి రూ.19 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఇంత మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తప్పనిసరిగా రావాలి

ఎంపికై న ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం 4 గంటల్లోపు గొలగమూడిలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. నియామకపత్రాలు అందుకునే టీచర్లు ఆధార్‌, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, (ఉపాధ్యాయుడు, సహచరుడు ఫొటోలు), డీఎస్సీ హాల్‌టికెట్‌ తెచ్చుకోవాలన్నారు.

జిల్లాకు కొత్తగా 657 మంది

రేపు నియామకపత్రాల అందజేత

ఇప్పటికే 192 మంది సర్‌ప్లస్‌ టీచర్లు

కొత్తవారు సైతం క్లస్టర్లకే పరిమితమా?

సెలవు పెట్టిన లేదా రిటైరైన వారి స్థానంలో బోధన

అయ్యోర్లకు పోస్టింగ్‌ ఎక్కడో?1
1/1

అయ్యోర్లకు పోస్టింగ్‌ ఎక్కడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement