
టీడీపీ నేత ధనదాహమే..
సంగం: పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురు దళిత కుటుంబాల్లో పెనువిషాదం నింపింది. ఓ టీడీపీ నేత ధనదాహం ఏడుగురిని కబళించింది. ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎటువంటి అనుమతులు లేకపోయినా.. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు. సామర్థ్యానికి మించి ఇసుక లోడ్ చేసుకుని మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. పెరమన దుర్ఘటనకు కారణమైన AP 39 WH 1695 టిప్పర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్‌పేట మండలం చిరమనకు చెందిన కాటం రవీంద్రారెడ్డికి చెందిన కేపీఆర్ మైన్స్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. మైనింగ్ కంపెనీ చాటున చేజర్ల మండలం పెరుమాళ్లపాడు, అనంతసాగరం మండలం పడమటికంభంపాడులో అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఏడుగురు మృత్యువాతకు కారణమైన టిప్పర్ దేశం నేతది కావడంతో ఈ కేసు తారుమారుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. డ్రైవర్‌గా మరో వ్యక్తిని బలి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సమాచారం.