
బేస్‌బాల్ ఎంపికలపై వివాదం
● భారత జట్టుకు అంటూ నిర్వాహకుల ప్రచారం
● ప్రశ్నించిన వివిధ క్రీడా సంఘాల నేతలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): బేస్‌బాల్ ఇండియా జట్టు ఎంపికల పేరుతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హడావుడి జరిగింది. నాలుగో బీఎఫ్‌ఏ ఉమెన్స్ బేస్‌బాల్ ఆసియా కప్ సెలక్షన్ ట్రైల్స్ పేరుతో మంగళవారం స్టేడియంలో ఎంపికలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై బుధవారం స్థానిక క్రీడాకారులు, క్రీడా సంఘ నేతలు నిర్వాహకులను ప్రశ్నించారు. వసతుల్లేని చోట భారతదేశ జట్టును ఎంపిక చేయడం ఏంటని అడిగారు. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అనుమతి ఇచ్చారని వారు చెప్పారు. నేతలు నిర్వాహకుడి గురించి ఆరా తీస్తే నవలాకులతోట జెడ్పీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడని తెలిసింది. ఫొటోలు తీయడం మొదలుపెట్టగానే అక్కడ కట్టిన ఫ్లెక్సీలను తీసేశారు. క్రీడాకారులు, నిర్వాహకులు వెళ్లిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంపికలంటూ రూ.లక్షలు దండుకుని తల్లిదండ్రులను మోసం చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. ఆటలాడేందుకు అనుమతిచ్చామని, అంతర్జాతీయ స్థాయి ఎంపికలకు ఎటువంటి పత్రాలు చూపించలేదని డీఎస్‌డీఓ అధికారులు చెబుతున్నారు.