
కసుమూరులో కానరాని ఏర్పాట్లు
వెంకటాచలం: మండలంలోని కసుమూరు మస్తాన్‌వలీ దర్గా 248వ గంధ మహోత్సవాలు గురువారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు వక్ఫ్ బోర్డు అధికారులను ఆదేశించారు. వేలాది మంది భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏటా ముందస్తుగా ఏర్పాట్లు చేసేవారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై దర్గా ముజావర్లు, భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉత్సవాలకు రూ.16 లక్షలతో వసతులు కల్పించాల్సి ఉన్నా, విద్యుద్దీపాలంకరణ, దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇంకా తాగునీరు, మొబైల్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.