
అక్రమ నిర్మాణాలను వదిలేసి..
● టౌన్‌ప్లానింగ్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
నెల్లూరు (బారకాసు): నగర నడిబొడ్డున, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగుతున్నా.. కార్పొరేషన్ అధికారుల కళ్లకు కనిపించలేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇటీవల మేయర్ స్రవంతి స్వయంగా వెళ్లి ఆ నిర్మాణాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మాణాన్ని ఎలా నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఆమె మండిపడ్డారు. సంబంధిత అధికారులు అనధికార నిర్మాణాన్ని తొలగించకుండా టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన కింది స్థాయిలోని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో కనకమహాల్ థియేటర్ ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇనుప గడ్డర్లతో రెండంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అయితే ఈ విషయం తెలిసి కూడా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఇందుకు సదరు నిర్మాణదారుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నగరంలోని వెంకట్రామాపురంలో మూడు బహుళ అంతస్తుల భవనాలు పరిమితికి మించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని భారీ క్రేన్లు, జేసీబీలు ఉపయోగించి పగులగొట్టే చర్యలు చేపట్టారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోయారంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు, ఆరోపణలు నేపథ్యంలో కనకమహాల్ థియేటర్ ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలకు కారణమయ్యారంటూ ఎన్‌ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్‌లో ఇన్‌చార్జిగా టీపీబీఓగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ సీహెచ్ శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అనధికార నిర్మాణాన్ని మాత్రం తొలగించే చర్యలు చేపట్టకుండా వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.