
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలైయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతదిగా గుర్తించారు. అప్పారావు పాలెం రీచ్ నుంచి నెల్లూరుకు రోజూ ట్రిప్పులు వేస్తున్నారు. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడికి చెందిన టిప్పర్‌గా సమాచారం. ఇసుక టిప్పర్.. రాంగ్ రూట్‌లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.
కారు నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండున్నర గంటలపైగా శ్రమించారు. మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్, గుర్రం వారి వీధికి చెందిన తాళ్లూరు రాధ(38), శ్రీనివాసులు (40), సారమ్మ(40), వెంగయ్య(45), లక్ష్మి(30), డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.