
సక్రమంగా ‘పోషణ మాసం’ కార్యక్రమాలు
నెల్లూరు (పొగతోట): అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘పోషణ మాసం’ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ సీడీపీఓలను ఆదేశించారు. మంగళవారం ఐసీడీఎస్ కార్యలయంలో సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలను ప్రణాళికల ప్రకారం నిర్వహించాలన్నారు. స్థూలకాయం నివారణ, చెక్కర, నూనెల వినియోగం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం, బాల్య దశ సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల
అభివృద్ధికి చర్యలు
● జెడ్పీ సీఈఓ మోహన్‌రావు
నెల్లూరు (పొగతోట): శిక్షణ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ మోహన్‌రావు కోరారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో మహిళ జెడ్పీటీసీల, ఎంపీపీలు, సర్పంచ్‌లకు ఆర్‌జీఎస్‌ఏ యాక్షన్ ప్లాన్ 2025–26పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సీఈఓ మాట్లాడారు. మహిళ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించాలన్నారు. అభివృద్ధి పనులను యాక్షన్ ప్లాన్‌లో పొందుపరచాలని తెలిపారు.
సీఎం సమీక్షలో కలెక్టర్, ఎస్పీ
నెల్లూరురూరల్: రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో శాంతిభద్రతల అంశంపై ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 66,066 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,620 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల సంక్షేమ సంఘ జిల్లా సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవీ భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని బీడీ, సున్నపు రాయి, డోలమైట్, మైకా, ఐరన్ ఓర్, మాంగనీస్, సినీ కార్మికుల పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు (ప్రీ మెట్రిక్) చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, ఐఐటీ (పోస్ట్ మెట్రిక్) చదివే విద్యార్థులు అక్టోబరు 31వ తేదీ లోపు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 040–2956 1297, హెల్ప్ లైన్ నంబరు 0120–6619540 ఫోన్ నంబర్లలో కానీ నగరంలోని జెడ్పీ కాలనీలో ఉన్న బీడీ కార్మికుల సంక్షేమ వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్‌ను సంప్రదించాలని కోరారు.

సక్రమంగా ‘పోషణ మాసం’ కార్యక్రమాలు