
పెన్నాతీరంలో టెన్షన్ టెన్షన్
ఆత్మకూరు: జిల్లా వరదాయని సోమశిల జలాశయం ఎగువన కురిసిన వర్షాలు, వరద నీటితో 74 టీఎంసీలకు చేరుకున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం 30 వేల క్యూసెక్కుల మేరకు దిగువ (పెన్నానది)కు విడుదల చేస్తుండడంతో ఆత్మకూరు నియోజకవర్గంలో పరిధిలోని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జలాశయం నుంచి అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల సంగం మండలాల మీదుగా పెన్నానది ప్రవహిస్తోంది. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు, ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం, సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామాలు పెన్నా పరీవాహక గ్రామాలు కావడంతో అక్కడ ఉన్న పొర్లుకట్టలు దెబ్బతిని ప్రమాదకరంగా తయారయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికార పార్టీ ఇసుకాసురుల నది కరకట్టలు ధ్వంసం చేయడంతో చిన్నపాటి వరద ఉధృతికి స్థానికులు వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా పెన్నానదిలో భారీగా ఇసుకను తరలించడంతో ఏర్పడిన గుంతలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. 2021లో వచ్చిన వరదలకు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగిన విషయం గుర్తు చేసుకొని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వీర్లగుడిపాడు గ్రామమైతే ఏకంగా జలదిగ్బంధంతో చిక్కుకోవడంతో అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పడవల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నానది పొర్లుకట్టలు పలు చోట్ల ధ్వంసం చేసి ఉండడంతో వేలాది క్యూసెక్కుల నీటికి పొర్లుకట్టలు తెగి గ్రామంలోకి నీరు చేరుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.