
నదిలో ఇరుక్కున్న ఇసుక ట్రాక్టర్
● ఇసుక అక్రమ తవ్వకాలే కారణం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని మినగల్లు ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పెన్నానదిలో చిక్కుకుపోయింది. సోమవారం రాత్రి సోమశిల నుంచి పెన్నానదికి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో అక్రమంగా నదిలో ట్రాక్టర్‌కు ఇసుక లోడు చేస్తున్నారు. ఒక్కసారిగా నీరు రావడంతో ట్రాక్టర్ నదిలో ఇరుక్కుపోయింది.
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
నదికి నీరు వదిలిన సమయంలో పిల్లి రమేష్‌కు సంబంధించి ట్రాక్టర్‌కు ఇసుక లోడు చేశారు. ఒక్కసారిగా నీరు రావడంతో ట్రాక్టర్‌లో ఇసుక అక్కడే అన్‌లోడు చేశారు. అయినప్పటికీ నీటి వేగం, ఉధృతి పెరగడంతో డ్రైవర్ వెంకటరమణయ్య ట్రాక్టర్ వదిలి బయటపడ్డాడు. ట్రాక్టర్ అయితే టాప్ వరకు మునిగిపోయింది. అంటే దాదాపు 10 అడుగుల మేర గుంత కావడంతో ట్రాక్టర్ మునిగిపోయింది. దీన్ని బట్టి ఏ స్థాయిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారో అర్థమవుతోంది.
భారీ ఎత్తున తవ్వకాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయినప్పటికీ టీడీపీ నాయకుల అండదండలు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. మినగల్లు, కాగులపాడు, జొన్నవాడ వద్ద టీడీపీ బుచ్చిరెడ్డిపాళెం రూరల్ అధ్యక్షుడి జగదీశ్ ఆధ్వర్యంలో రాత్రిళ్లు ఇసుక మాఫియా చెలరేగి పోతోంది. భారీ ఎత్తున తవ్వకాలు జరపడంతో నదిలో 15 అడుగల మేర గుంతలు ఏర్పడ్డాయి. వరద ఉధృతి ఇంకా ఎక్కువైతే సమీప గ్రామాలైన మినగల్లు, జొన్నవాడ, కాగులపాడు గ్రామాల ప్రజలకు తీవ్ర ముప్పు తప్పదు. ధన, ప్రాణ, ఆస్తి నష్టం ఊహించని రీతిలో సంభవించే అవకాశం ఉంది.