
పరిహారమిచ్చి పనులు చేపట్టండి
కలిగిరి: నష్టపరిహారం అందించిన తర్వాతే తమ భూముల్లో నేషనల్ హైవే నిర్మాణ పనులు చేపట్టాలని పలువురు రైతులు, లబ్ధిదారులు కాంట్రాక్టర్లకు తెల్చి చెప్పారు. కలిగిరి సమీపంలో వింజమూరు మార్గంలో జరుగుతున్న ఎన్‌హెచ్ 167బీజీ నిర్మాణపు పనులను మంగళవారం పలువురు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ భూసేకరణ సమయంలోనే తమకు న్యాయమైన నష్టపరిహారం మంజూరు చేయలేదని అప్పట్లోనే 11 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ ప్రకారం సెంట్‌కు రూ.4.76 లక్షలు రావాల్సి ఉండగా రూ.35,600 మాత్రమే మంజూరైందన్నారు. అప్పట్లో తాము నోటీసులు కూడా తీసుకోలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్ వద్ద విచారణ జరుగుతుందన్నారు. తమకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని, తమ స్థలంలో రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టరాదని సూచించారు. దీనిపై హైవే నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ నష్టపరిహారం విషయం కలెక్టర్ పరిధిలో ఉందన్నారు. అక్టోబరు 15వ తేదీలోపు రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయాలని తమకు నిబంధనలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎవరికీ సమస్యలు లేకుండా రోడ్డు నిర్మాణపు పనులు చేపడుతామని తెలిపారు.