
ఇసుక తవ్వకాలతో కట్టలు బలహీనం
మండల పరిధిలోని పెన్నా తీరంలో సూరాయపాళెం, విరువూరు, మహ్మదాపురం గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాంతంలో ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్నారు. మహ్మదాపురం గ్రామస్తులు చాలా రోజులుగా రీచ్‌ను నిర్వహించేందుకు వ్యతిరేకించడంతో సూరాయపాళెం వద్ద డ్రెడ్జింగ్ పద్ధతిలో, విరువూరు ఓపెన్ రీచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఓపెన్ రీచ్‌కు జిల్లాలో ఎక్కడా అనుమతులు లేవు. డ్రెడ్జింగ్ విధానంలోనూ అక్టోబరు వరకు ఇసుక తవ్వకాలు చేపట్లొద్దని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సూరాయపాళెం వద్ద ఏకంగా డ్రెడ్జింగ్ పేరుతో పొర్లుకట్టను తెగ్గొట్టారు. కట్టలపైనే తాత్కాలికంగా రోడ్లను నిర్మించి ఇష్టానుసారం ఇసుకను తరలించారు. దీంతో పొర్లు కట్టలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. సంగం బ్యారేజీకు అతి సమీపంలోనే ఇసుక తవ్వకాలు సాగించడం వల్ల పెనుముప్పు ఉందని హెచ్చరించినా పట్టించుకున్న వారు లేరు. పాత కట్టలను తెగ్గొట్టి ఇసుకను అదే మార్గం ద్వారా తరలించేవారు.