
అందరూ సేఫ్
నెల్లూరు(క్రైమ్): పెన్నానదిలో చిక్కుకున్న 18 మంది సురక్షితంగా ఉన్నారు. 9 మందిని పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. మిగిలిన వారు పోలీసుల భయంతో వివిధ మార్గాల్లో ఇళ్లకు చేరుకున్నారు. సోమశిల జలాశయం నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రి భగత్‌సింగ్ కాలనీ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. నెల్లూరు నగరంలోని హరనాథపురం, చంద్రబాబునగర్, సంతపేట, జాకీర్‌హస్సేన్ నగర్, కిసాన్‌నగర్, భగత్‌సింగ్ కాలనీ, కోవూరు మందబయలు సెంటర్‌కు చెందిన 18 మంది పేకాట ఆడేందుకు, మద్యం తాగేందుకు జాతీయ రహదారి పెన్నా బ్రిడ్జి కింద ఇసుకదిబ్బల్లోకి వెళ్లి నీటిలో చిక్కుకుపోయారు. దీంతో వారు తమను రక్షించాలంటూ పెద్దగా కేకలు వేశారు. అనంతరం 112కు కాల్ చేసి పరిస్థితిని వివరించారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరారు. అలాగే అగ్నిమాపక అధికారులకు విషయాన్ని తెలియజేశారు. డీఎఫ్‌ఓ వాకా శ్రీనివాసులురెడ్డి ఆదేశాలతో లీడింగ్ ఫైర్‌మెన్ చంద్రశేఖర్ సిబ్బందిని తీసుకుని నూతన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జిపై నుంచి రోప్‌లు, నిచ్చెన సాయంతో వారు నదిలోకి దిగారు, చిమ్మచీకటిగా ఉండటంతో ఆక్సాలైట్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిదిమందిని రక్షించి బయటకు తీసుకొచ్చారు.
గేట్లు మూసి..
ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లను మూసివేయడంతో నీటి ప్రవాహం తగ్గింది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసులు నమోదు చేస్తారని భావించిన మిగిలిన తొమ్మిది మంది బయటకు రాకుండా పరుగులు తీశారు. ఏమీ చేయమని వచ్చేయాలని ఇన్‌స్పెక్టర్ మైక్ ద్వారా సూచించినా వారు రాలేదు. పోలీసులు పట్టుకుంటే ఇబ్బంది వస్తుందని భావించిన సదరు వ్యక్తులు వివిధ మార్గాల్లో ఇళ్లకు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు తొలుత రక్షించిన వారి నుంచి మిగిలిన వారి ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్ చేయగా అందరూ సురక్షితంగా ఉన్నారని తెలియడంతో రక్షణ చర్యలను నిలిపివేశారు. అందరూ క్షేమంగా ఉండటంతో అఽధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం 18 మందికి నవాబుపేట ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు.
పెన్నాలో చిక్కుకున్న 18 మంది
పేకాటాడేందుకు,
మద్యం తాగేందుకు వెళ్లి..
9 మందిని రక్షించిన అధికారులు
పోలీస్ భయంతో మిగిలిన వారు
ఇతర మార్గాల్లో వెళ్లిన వైనం