
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ నిరసన
నెల్లూరు రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.దశరథరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరత్ మాట్లాడుతూ ఆర్థిక బకాయిలు విడుదల చేయడంలో, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం ఏ మాత్రం ఉద్యోగులపక్షం వహించడం లేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. యాప్‌ను, అసెస్మెంట్ బుక్‌లెట్ విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలన్నారు. అనంతరం జేసీ కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.