
కూటమి అందించు ‘ఎనీటైం మద్యం’
నెల్లూరు(క్రైమ్): మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకొనే పనిలో ఉన్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన ఎకై ్సజ్ శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. జిల్లాలో 200 మద్యం దుకాణాలున్నాయి. అమ్మకాలు పెంచుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సమయపాలనకు నీళ్లొదిలారు. దుకాణాలు రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే అనేక ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు విక్రయాలు చేస్తున్నారు. మరోవైపు బెల్టుషాపుల నిర్వహణ నేరమని తెలిసినా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మద్యం వ్యాపారం అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లడంతో పట్టణాలు, గ్రామాల్లో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. క్వార్టర్‌పై రూ.40 వరకు మందుబాబుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది.