
పెన్నాతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి
సంగం: సోమశిల జలాశయం నుంచి సంగం బ్యారేజ్‌కు వస్తున్న 32 వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నామని, పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఈ విజయరామిరెడ్డి తెలిపారు. సంగం బ్యారేజ్ నుంచి సోమవారం ఆయన నీటిని దిగువ పెన్నాకు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సోమశిల నుంచి బ్యారేజ్‌కు 20 వేల క్యూసెక్కులు వస్తున్నాయని, అందులో బెజవాడ పాపిరెడ్డి కాలువకు 550 క్యూసెక్కులు, నెల్లూరు బ్యారేజ్‌కు 19,450 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. సాయంత్రానికి 30 వేల క్యూసెక్కులకు పైగా మట్టం పెరుగుతుందని, 24 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దిగువ ఉన్న వీర్లగుడిపాడు, కోలగట్ల, పడమటిపాళెం, పల్లిపాళెం, మక్తాపురం, అన్నారెడ్డిపాళెంతోపాటు జిల్లా వ్యాప్తంగా పెన్నానది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ వినయ్‌కుమార్, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, నేతలు బీ శ్రీనివాసులరెడ్డి, జీ శ్రీనివాసులుయాదవ్, ఎస్సై రాజేష్, ఆర్‌ఐ సల్మా, బ్యారేజ్ ఇన్‌చార్జి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పెన్నాకు 26,500 క్యూసెక్కులు
సోమశిల: జలాశయం నుంచి పెన్నాకు 5, 6 క్రస్ట్ గేట్ల ద్వారా 26,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 29,588 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 74.420 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నానదితోపాటు ఉత్తరకాలువకు 400, కండలేరుకు 10,550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.