
మధ్యవర్తిత్వంతోఇరుపక్షాలకు ప్రయోజనం
రూ.1.9 కోట్ల
బకాయిల వసూలు
నెల్లూరు(బారకాసు): జాతీయ లోక్ అదాలత్ ద్వారా నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి, కుళాయి పన్ను బకాయిదారులు, ట్రేడ్ లైసెన్స్‌ల రూపేణా రూ.1,09,05,045 వసూలయ్యాయని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా బకాయిలున్న 1500 మందికి నోటీసులను జారీ చేయగా, 700 మంది హాజరయ్యారని వివరించారు. వీరిలో 300 మంది పన్నుల బకాయిలను చెల్లించగా, మిగిలిన 400 మంది మరో అవకాశాన్ని కోరారని చెప్పారు. తదుపరి నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో వీటిని చెల్లించాల్సిందిగా సూచించామన్నారు. హాజరుకాని వారికి మరోసారి నోటీస్‌ను జారీ చేసి క్రిమినల్ కేసును నమోదు చేస్తామని వివరించారు. ఇంజినీరింగ్ విభాగ ఎస్‌ఈ రామ్మోహన్‌రావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఈఈ శేషగిరిరావు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
నెల్లూరు (లీగల్): కోర్టు కేసులకు సంబంధించి మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు జాతీయ లోక్ అదాలత్‌లో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కక్షిదారులు రాజీపడి వస్తే లోక్ అదాలత్‌లో సత్వర న్యాయాన్ని అందిస్తామని వివరించారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన వివిధ శాఖలు, న్యాయాధికారులు, న్యాయవాదులకు కృతజ్ఞతలను తెలియజేశారు. కక్షిదారులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఏఎస్పీ సౌజన్య, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, విద్యుత్ శాఖ విజిలెన్స్ సీఐ ఆంజనేయులురెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
8920 కేసులకు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో 8920 కేసులను పరిష్కరించి.. లబ్ధిదారులకు రూ.7,86,44,647 మేర చెల్లించారు. కోవూరులో 142, కావలిలో 96, ఆత్మకూరులో 69, ఉదయగిరిలో 62, గూడూరులో 45, కోటలో 47, నాయుడుపేటలో 63, సూళ్లూరుపేటలో 64, వెంకటగిరిలో 100 కేసులు పరిష్కారమయ్యాయి.
ఆరు ప్రత్యేక బెంచ్‌లు
నెల్లూరులోని వివిధ కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి గానూ ఆరు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా న్యాయమూర్తులు తేజోవతి, శ్రీనివాస్, స్వాతి, శారదారెడ్డి, అబ్దుల్ రెహ్మాన్, నిషాద్ నాజ్ వ్యవహరించి 8195 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి పర్యవేక్షించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మధ్యవర్తిత్వంతోఇరుపక్షాలకు ప్రయోజనం