
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో విఫలం
ఉదయగిరి రూరల్: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చలపతిశర్మ ఆరోపించారు. రణభేరి ప్రచార యాత్రను సోమవారం నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో యూటీఎఫ్ నేతలు, సభ్యులతో పట్టణంలోని సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ, ఐఆర్, డీఏలు తదితర బకాయిలను చెల్లించకపోవడం తదితర సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రణభేరి ప్రచార యాత్రను ఈ నెల 19 వరకు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఉదయగిరిలో ఈ నెల 17న చేపట్టనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 25న చేపట్టనున్నామన్నారు. తొలుత పోస్టర్లను ఆవిష్కరించారు. యూటీఎఫ్ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, నాయబ్, తిరుపతయ్య, సుబ్బారెడ్డి, హనీఫ్, శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, మున్నా, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, నసృల్లా తదితరులు పాల్గొన్నారు.