ఎడగారుకు యూరియా కొరత, పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. దీనికితోడు బుధవారం రాత్రి ఒక్కసారిగా కురిసిన వర్షం వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, చేజర్ల మండలాల్లో వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నేలవాలిన వరి
● పరుగులు తీసిన అన్నదాతలు
● కొనుగోలు కేంద్రాలు పెట్టాలని వినతి
సంగం: వర్షంతో సంగం మండలంలోని దువ్వూరు, జెండాదిబ్బ, అన్నారెడ్డిపాళెం, తలుపూరుపాడు, పెరమన, కొరిమెర్ల, జంగాలకండ్రిక, సంగం రెవెన్యూ గ్రామాల్లో 2 వేల ఎకరాలకు పైగా, చేజర్ల మండలంలో 200 ఎకరాలకు పైగా వరి నేలవాలింది. చేతికొచ్చిన పంట ఇలా కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
పరుగులు పెట్టిన అన్నదాతలు
రాత్రి సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో అన్నదాతలు తమ పొలాల వైపు పరుగులు పెట్టారు. ఇప్పటికే కోతలు ప్రారంభమై ఉండటంతో పలుచోట్ల ధాన్యాన్ని గుట్టలుగా పోసి అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షంతో నీరు చేరుతుందనే భయంతో ధాన్యం వద్దకు వెళ్లి టార్పాలిన్ పట్టలు కప్పారు.
ఆందోళన చెందుతూ..
వర్షంతో వరిపైరు నేలవాలింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దళారులు పుట్టిని కేవలం రూ.14 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వరి నేలవాలడంతో ధాన్యం పచ్చగింజ పడ్డాయని సాకు చెప్పి దళారులు మరింత దోపిడీకి పాల్పడి ధరలు తగ్గిస్తారన్న ఆందోళన నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
పాపం అన్నదాతలు
పాపం అన్నదాతలు
పాపం అన్నదాతలు