
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరిలోని ఎర్రతోట ప్రాంతానికి చెందిన చిట్టారి మాధవి (38) అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మాధవికి కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి భాగ్యరావుతో వివాహమైంది. వారికి బీటెక్ పూర్తి చేసిన కుమార్తె, బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా మాధవి కలిగిరిలో ఉంటోంది. భాగ్యరావు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తున్నాడు. కలిగిరి ఎస్సీ కాలనీకి చెందిన గోసాల మధు అనే యువకుడితో మాధవి సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయమై అతని కుటుంబంలో వివాదాలున్నాయి. బుధవారం రాత్రి మధు కుటుంబ సభ్యులు, బంధువులు మాధవి ఇంటికెళ్లి ఒంటరిగా ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టారు. ఇంటి యజమానురాలు వారించినా వినిపించుకోకుండా దాడి చేశారు. తల్లిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న కుమారుడు మణిదీప్ గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. ఆరుబయట ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. మనస్తాపానికి గురైన మాధవి వంట గదిలోకి తాడుతో ఊరేసుంది. కుమారుడు గుర్తించి కత్తితో తాడును కత్తిరించి రిక్షాలో తల్లిని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పీహెచ్‌సీ వద్దకు తరలించారు. మాధవి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమైపె దాడి చేసి మృతికి కారణమైన మధుతోపాటు అతడి కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఎస్సై ఉమాశంకర్ పరిశీలించారు. మధు, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.