
అనుమానాస్పద స్థితిలో..
● వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
అడవిలో..
సంగం: మండలంలోని సంగం చెక్‌పోస్ట్ సెంటర్ సమీపంలోని అడవిలో చల్లా రాము (41) అనే వ్యక్తి గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. ఆటో తోలుకుని జీవించే రాము ఎలా చనిపోయాడో అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాముకు భార్య సీతారావమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
దుత్తలూరు మండలంలో..
దుత్తలూరు: మండలంలోని వెంకటంపేట గ్రామ బీసీ కాలనీకి చెందిన పఠాన్ సనా (17) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పఠాన్ ఖాదర్‌బాషా, నాజున్నీసాలకు ఇద్దరు కుమార్తెలు. ఖాదర్‌బాషా పొట్టకూటి కోసం గల్ఫ్‌కు వెళ్లి ఇటీవల సొంతూరికి వచ్చాడు. పెద్ద కుమార్తె సనా ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. అనారోగ్యంగా ఉండటంతో గురువారం భార్యాభర్తలు ఉదయగిరి వైద్యశాలకు వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికెళ్లి చూడగా కుమార్తె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆటోలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సనా మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.