పోర్టుపై కూటమి సర్కార్‌ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోర్టుపై కూటమి సర్కార్‌ నిర్లక్ష్యం

Sep 12 2025 5:57 AM | Updated on Sep 12 2025 3:58 PM

నత్తనడకన నిర్మాణ పనులు

కాంట్రాక్ట్‌ సంస్థ మార్పుతో ఆర్నెల్ల పాటు ఎక్కడికక్కడే

ఆపై ప్రారంభించినా.. ఊపందుకోని వైనం

బ్రేక్‌ వాటర్‌ ఫీడర్ల నిర్మాణానికే పరిమితం

చెప్పేదొకటి.. చేసేదొకటి అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ తీరే దీనికి చక్కటి ఉదాహరణ. నాడు చకచకా పనులు సాగి, గతేడాది ఏప్రిల్‌ నాటికి మొదటి దశ పూర్తి కావాల్సిన ఈ నౌకాశ్రయం సర్కార్‌ నిర్లక్ష్య ధోరణి కారణంగా అతీగతీ లేకుండాపోతోంది. దీనిపై ఏ మాత్రం దృష్టి సారించకుండా.. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 70 శాతం పూర్తయిన దీనిపైనే శ్రద్ధ చూపని పాలకులు.. మిగిలిన వాటిని ఎలా నిర్మిస్తారు.. ఇదంతా బూటకమనే విషయం వారి చేష్టలతోనే స్పష్టమవుతోంది.

కందుకూరు: రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ హయాంలో దీని నిర్మాణ పనులు చకచకా సాగినా, ప్రస్తుతం అడుగు ముందుకు పడటంలేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరాక.. అప్పటికే పనులు చేస్తున్న ఏజెన్సీని తొలగించడంతో ఆర్నెల్ల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత చేపట్టినా, పనుల్లో వేగం నేటికీ పుంజుకోలేదు. గతంలో చేసిన వర్కుల మినహా ప్రస్తుతం ఏ మాత్రం పురోగతి లేదు.

అసలెప్పటికి పూర్తవుతుందో..?

వాస్తవానికి డిసెంబర్‌, 2023 నాటికే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే మరో నాలుగేళ్లకై నా నిర్మాణం పూర్తవుతుందాననే అనుమానం తలెత్తుతోంది.

ప్రస్తుతం.. గ్రహణం

గతేడాది జూన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతోనే పోర్టు నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. అధికారం చేజిక్కించుకున్న వెంటనే కాంట్రాక్ట్‌ సంస్థ అరబిందోను తొలగించింది. తదనంతరం దాదాపు ఆర్నెల్ల పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆపై నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అయితే అప్పటికే పాత సిబ్బందిని తొలగించడం.. కార్మికులు, భారీ యంత్రాలను సమకూర్చడంలో చోటుచేసుకున్న జాప్యంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నా, అవి నామమాత్రమే. గతంలో చేపట్టిన బ్రేక్‌ వాటర్‌ ఫీడర్ల నిర్మాణ పనులను అరకొరగా జరుపుతున్నారు. కీలకమైన డ్రెడ్జింగ్‌, బెర్తుల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు.

నీరుగారిన ఆశయం

తీర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం వద్ద రూ.3736 కోట్ల అంచనాతో పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో పునాది రాయి పడింది. 850.79 ఎకరాల్లో పనులకు 2022, జూలై 20న నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులను అరబిందో సంస్థ వాయువేగంతో 70 శాతం మేర చేసింది. 18 నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు సాగాయి. డిసెంబర్‌, 2023 నాటికి మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో సర్కార్‌ అడుగులేసింది. అయితే ఆపై 2024 సాధారణ ఎన్నికల హడావుడి, కోడ్‌ అమల్లోకి రావడంతో అది సాధ్యపడలేదు.

ప్రస్తుత పరిస్థితి..

ఒక బెర్తు నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన మూడు బెర్తులతో పాటు, సముద్ర లోతును పెంచే డ్రెడ్జింగ్‌ పనులు జరగాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్‌ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని నాటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సంకల్పించినా, ప్రస్తుత సర్కార్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రామాయపట్నం పోర్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు.

ఉన్నతాశయంతో.. 1
1/1

రామాయపట్నం పోర్టు నిర్మాణ తీరు (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement