నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ పాలసీకి వ్యాపారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో ఓపెన్ కేటగిరీ కింద 50.. గీత కులాలకు సంబంధించిన ఐదు బార్లకు గత నెల 30, ఈ నెల రెండో తేదీన నిర్వహించిన లాటరీ ప్రక్రియలో 22 మంది వ్యాపారులు దక్కించుకున్నారు. మిగిలిన 33 బార్లకు రీ నోటిఫికేషన్‌ను ఈ నెల మూడున జారీ చేశారు. ఆఫ్‌లైన్ / ఆన్‌లైన్ విధానాల్లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. 15న లాటరీ డ్రా తీస్తామని అధికారులు ప్రకటించారు. అయితే స్వీకరణ గడువును మరో మారు పొడిగించినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాలేదు.
జిల్లాలోని మిగిలిన 33 బార్లకు గానూ నగరంలో నాలుగు, కావలిలో ఒకటి మొత్తంగా ఐదింటికి 20 దరఖాస్తులే దాఖలయ్యాయి. మిగిలిన వేటికీ దరఖాస్తులేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో మిగిలిన బార్లకు దరఖాస్తులు వేయించేందుకు బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యా పారులు, పాత మద్యం వ్యాపారులతో ఎకై ్సజ్ అధికారులు చర్చిస్తున్నారు. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఏ మేరకు దాఖలవుతాయో వేచి చూడాలి.
నూతన కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
● అనంతపురానికి ఆనంద్ బదిలీ
నెల్లూరు రూరల్: జిల్లా నూతన కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఆనంద్‌ను అనంతపురం కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలో పనిచేసిన ఆయన 14 నెలల్లో రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. స్వల్ప వ్యవధిలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. జీఏడీలో ఐ అండ్ పీఆర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న 2013వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ హిమాన్షు శుక్లా ఇక్కడ కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అసిస్టెంట్ కలెక్టర్‌గా విశాఖపట్నంలో.. సబ్ కలెక్టర్‌గా తిరుపతి, విజయవాడలో.. గుంటూరు జే సీగా.. పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కో నసీమ జిల్లాల కలెక్టర్‌గా ఈయన పనిచేశారు.
పర్యాటకాభివృద్ధికి కృషి
నెల్లూరు రూరల్: జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ కోరారు. బారాషహీద్ దర్గా వద్ద గల జిల్లా పర్యాటక కేంద్రంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. ఉదయగిరి దుర్గాన్ని ట్రెక్కింగ్‌కు అనుకూలంగా మారుస్తామని వెల్లడించారు. పరిశుభ్రతను మెరుగుపర్చి పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక.. వారసత్వ కోటలు, జలపాతాలు, ఎకో టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహిస్తూ విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు, సృజనాత్మక ప్రతిభ కలిగిన వారికి పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. ఫొటోలు హైరెజల్యూషన్ కలిగి జిల్లాలో తీసినవే అయి ఉండాలన్నారు. పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20లోపు అందజేయాలని కోరారు. కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో స్క్రూట్నీ చేసి విజేతలను ప్రకటించనున్నామని చెప్పారు. విజేతలకు బహుమతులను ఈ నెల 27న అందజేయనున్నామని, వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏఎస్‌పేట గంధ మహోత్సవంపై సమీక్ష
ఆత్మకూరు: ఏఎస్‌పేటలోని ఖాజానాయబ్ రసూల్ దర్గా గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని తన కార్యాలయంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గంధ మహోత్సవాన్ని ఈ నెల 18 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. మౌలిక వసతులను కల్పించాలని కోరారు. సరిపడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా ఈఓ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.