
అవినీతి తప్ప అభివృద్ధేదీ..?
● ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని.. సర్వేపల్లిలో సోమిరెడ్డి, ఆయన కుమారుడు దోచుకుతింటూ బిజీగా గడుపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో గురువారం ఆయన పర్యటించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడంలేదనే విషయాన్ని ఆయన దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోగా.. కనీసం ఒక్క బస్తా యూరియా లభ్యం కావడంలేదని ఆరోపించారు. రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లపై విద్యుత్ వైర్లు వెళ్తే వాటిని తొలగించి కొత్త లైన్లు వేసేందుకు తమ ప్రభుత్వ హయాంలో నిధులను మంజూరు చేస్తే, వాటినీ ప్రభుత్వం నిలిపేసిందని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్తున్నారే తప్ప, హామీలను నెరవేర్చడంలేదని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు యూరియా సమృద్ధిగా లభించిన అంశాన్ని గుర్తుచేశారు.
మాట్లాడితే పోలీస్ కేసులు..
ప్రభుత్వాన్ని విమర్శించినా.. వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా పోలీస్ కేసులు పెడుతున్నారని కాకాణి ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే అధికారులెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా, తమ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తామెలా ఉన్నాం.. ప్రస్తుతం ఎలా ఉన్నామనే అంశాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని చెప్పారు. అన్నదాత పోరుకు వచ్చిన స్పందనే దీనికి నిదర్శనమన్నారు. ఇటీవల మృతి చెందిన వీరాస్వామి కుటుంబీకులకు పరామర్శించారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ కరిపరెడ్డి కృష్ణారెడ్డి, నేతలు అశోక్‌కుమార్‌రెడ్డి, మాలకొండారెడ్డి, శ్రీహరి, తిరుపాల్‌రెడ్డి, రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.