
గ్రామసభ తీర్మానాన్ని అమలు చేయాలి
కందుకూరు: ఇండోసోల్ కంపెనీ కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ కరేడులో నిర్వహించిన గ్రామసభలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని, గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేందుకు తాము సిద్ధంగా లేమని కరేడు పంచాయతీ పరిధిలోని ఉప్పరపాళెం దళితులు పేర్కొన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీకి వినతిపత్రాన్ని గురువారం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. కరేడు పంచాయతీలో 8348 ఎకరాలు, ఉప్పరపాళెం, రామకృష్ణాపురం, పొట్టేటిగుంట గిరిజన సంఘాలను ఖాళీ చేయాలని ఇప్పటికే నోటిఫికేషన్‌ను ఇచ్చారని తెలిపారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. భూములు, ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఇంటింటికీ పంచాయతీ కార్యదర్శి వచ్చి కొలతలు తీయడంతో పాటు అకౌంట్ నంబర్లనూ సేకరిస్తున్నారని చెప్పారు. బలవంతపు భూసేకరణను నిలిపేయాలని కోరారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే పచ్చని పంటలు పండే పొలాలను తీసుకోవడం తగదన్నారు. గ్రామంలోని రైతులు, ఉద్యమ సంఘాల నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తొలుత ఆందోళనను చేపట్టారు. ఉప్పరపాళెం గ్రా మస్తులు గంజి చినకోటేశ్వరరావు, ప్రసాద్, అభిషే క్, శ్రీణు, కొట్టే మాలకొండయ్య, రమణమ్మ, పిచ్చమ్మ, ప్రజా సంఘాల నేతలు కుమార్, వెంకటేశ్వర్లు, వీసం విజయ్ తదితరులు పాల్గొన్నారు.