
మొదటి దశ ఎప్పుడో..?
రామాయపట్నం పోర్టు మొదటి దశలో భాగంగా 34.04 ఎమ్మెమ్టీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) కార్గో సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించాల్సి ఉంది. వీటిలో రెండు జనరల్, ఒకటి కోల్, మరొకటి మల్టీ పర్పస్‌కు సంబంధించనవి. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫాన్లను తట్టుకునేలా సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిని నీటి ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఇందులో సౌత్ బ్రేక్ వాటర్ ఫీడర్ 3.7.. నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ 1.73 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. వీటి మధ్యలోనే బెర్తులనూ నిర్మిస్తున్నారు. లక్ష టన్నుల సామర్థ్యం గల భారీ నౌకలు నిలిచేందుకు వీలుగా సముద్ర లోతును 16 మీటర్ల వరకు గతంలోనే డ్రెడ్జింగ్ చేశారు. బల్క్ బెర్తును నిర్మించి, 2023 డిసెంబర్ నాటికే మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో పనులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికే మొదటి దశలో కీలకమైనవన్నీ పూర్తయ్యాయి. ఆపై సర్కార్ నిర్లిప్త ధోరణితో ఏ మాత్రం పురోగతి కనిపించడంలేదు.