
40 గ్రాముల బంగారం, నగదు చోరీ
విడవలూరు: మండలంలోని వావిళ్లలో ఓ ఇంట్లో 40 గ్రాములు బంగారం, రూ.20 వేల నగదును దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచోసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో గుంజి శ్రీనివాసులు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతని ఇంటి పక్కనే చిన్న గదిలో తల్లి నాగమ్మ ఉంటోంది. ఆమె ఉదయం గదిలో ఉంటుంది. రాత్రి వేళ్లలో కుమారుడి ఇంటికెళ్లి నిద్రిస్తుంది. సోమవారం రాత్రి గదికి తాళం వేసి వెళ్లింది. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దొంగలు బీరువాలోని 40 గ్రాముల బంగారం, రూ.20 వేలు ఎత్తుకెళ్లినట్లు ఆమె గుర్తించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించింది.