
గెజిటెడ్ ఆఫీసరైనా అంతే..
ముత్తుకూరు పీహెచ్‌సీలో విల్సన్ గెజిటెడ్ అధికారి. ఆయన 2023 ఏప్రిల్ నెలలో ప్రమాదానికి గురయ్యారు. తర్వాత మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు బిడ్డలున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త కాలం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భార్య తన భర్తకు చెందిన ఆర్జిత సెలవులు, పెన్షన్, గ్రాట్యుటీ కోసం వైద్యశాఖ చుట్టూ తిరుగుతోంది. ఇలా రెండేళ్ల నాలుగు నెలల పాటు తిరిగి, తిరిగి వేసారి పోయింది. వైద్యశాఖలో ఆ బిల్లులు చేయాల్సిన ఈ–1 సీనియర్ అసిస్టెంట్ గత నాలుగు నెలలుగా తిప్పుకుంటున్నాడు. అంతకు ముందు ఆ సీట్లో ఉన్న మరో మహిళా ఉద్యోగి కూడా ఇలాగే తిప్పుకుంది. ఆ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ అడిగింత ముడుపులు చెల్లిస్తేనే బిల్లులు పెడుతానంటూ ఈ–1 సీటు చూస్తున్న సీనియర్ అసిస్టెంట్ పేర్కొనడంతో విల్సన్ కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదనకు గురైంది.
● మరో బయాలజిస్ట్ ఆర్జిత సెలవులకు సంబంధించి కూడా అలాగే తిప్పుకుంటున్నారు.
● ఒక రికార్డు అసిస్టెంట్ రిటైర్ట్ అయినప్పటికీ తన 10 నెలల జీపీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ ఎంటర్ చేయాలని పదే పదే వేడుకుంటున్నా ఫలితం శూన్యం.
● ఉద్యోగి ఎవరైనా మృతి చెందితే మట్టి ఖర్చుల కింద ట్రెజరీ కొంత నగదు చెల్లిస్తోంది. అయితే అందుకు సంబంధించిన బిల్లు సైతం వైద్యశాఖ సిబ్బంది పంపాలి. అందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని సాటి ఉద్యోగులే పేర్కొంటున్నారు.